నిబద్ధతతో పనిచేసే అధికారులకు తగిన గుర్తింపు
ఏలూరు, మేజర్ న్యూస్ : నిబద్దతతో పనిచేసే అధికారులను సిబ్బంది ఎప్పటికీ గుర్తుంచుకుంటారని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. కలెక్టరేట్లో పరిపాలనాధికారిగా పనిచేస్తున్న ఎన్ .వి. నాంచారయ్య పదవీ విరమణ సందర్భంగా స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో శనివారం రాత్రి ఏర్పాటుచేసిన వీడ్కోలు సభలో నాంచారయ్య దంపతులను పూలమాల, దుశ్శాలువా, మెమెంటోలతో ఘనంగా సత్కరించారు. సభలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వ ఉద్యోగం గొప్ప అవకాశమని, అది అందరికీ దొరకదన్నారు. విధి నిర్వహణలో నిబద్దత, జవాబుదారీతనంతో పనిచేసి, కింద స్థాయి సిబ్బందికి ఆదర్శంగా నిలిచే వ్యక్తులు అధికారులు, సిబ్బంది మనసులలో ఎప్పటికీ నిలిచిపోతారన్నారు. నాంచారయ్య వివిధ రెవిన్యూ శాఖలలో హోదాలలో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. వారి ఉద్యోగ విరమణ జీవితం ఆయురారోగ్యాలతో, ఆనందంతో, సంతోషంతో సాగాలని ఆకాంక్షించారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి, ఇంచార్జ్ డిఆర్ఓ ఎం. ముక్కంటి, ఎస్డీసీ దేవకీదేవి, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, కలెక్టరేట్ సిబ్బంది పోతురాజు, శేషగిరి, కలెక్టరేట్ సిబ్బంది, విశ్రాంత ఉద్యోగులు, నాంచారయ్య కుటుంబసభ్యులు, ప్రభృతులు పాల్గొన్నారు.