కొనుగోలు కేంద్రం ప్రారంభించండి మహాప్రభో
జిన్నారం;జిన్నారం మున్సిపల్ కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని రైతులు సంబంధిత అధికారులను కోరుతున్నారు. పంట చేతికొచ్చిన సమయంలో కొనుగోలు కేంద్రం అందుబాటులో లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వరి కోతలు పూర్తి చేసుకున్న పలువురు రైతులు ధాన్యాన్ని కల్లాలు, రోడ్ల పక్కన ఆరబోస్తూ కొనుగోలు కేంద్రం ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఎంతో కష్టపడి పండించిన పంట వర్షం కారణంగా తడవడంతో ధాన్యం నాణ్యత దెబ్బతింటుందేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, మరోవైపు కొనుగోలు కేంద్రం ప్రారంభం కాకపోవడంతో ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలో, ఎవరికి విక్రయించాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ, జిన్నారం మున్సిపల్ కేంద్రంలో మాత్రం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రం అందుబాటులో లేకపోతే ప్రైవేటు వ్యాపారులు, దళారులను ఆశ్రయించాల్సి వస్తుందని, దీంతో తాము పండించిన పంటకు సరైన ధర లభించక నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్నారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ధాన్యాన్ని ఎక్కువ రోజులు బయట ఉంచడం సాధ్యం కావడం లేదని రైతులు పేర్కొంటున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు అదనపు శ్రమతో పాటు సమయం కూడా వెచ్చించాల్సి వస్తోందన్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల పరిస్థితిని పరిశీలించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించి జిన్నారం మున్సిపల్ కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తక్షణమే ప్రారంభించాలని, తడిసిన ధాన్యం విషయంలో రైతులకు తగిన సహకారం అందించాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.