కూటమిపై ప్రజల విశ్వాసానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనం గ్రామ పంచాయతీల్లోనూ కూటమి అభ్యర్థులదే విజయం కావాలి : ఎమ్మెల్యే బుద్ధప్రసాద్
అవనిగడ్డ, మేజర్ న్యూస్: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు ప్రజలు కూటమి ప్రభుత్వానికి అండగా ఉన్నారని నిరూపించాయని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన కోడూరు మండల జనసేన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు అత్యధిక మెజారిటీలతో విజయం సాధించడం జనసేన పార్టీపై, అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రజలకు ఉన్న అభిమానానికి నిదర్శనమన్నారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోని గ్రామీణ ప్రాంతాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రం నుంచి సాధించిన నిధులతో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని తెలిపారు. కోడూరు మండలంలో కీలకమైన ఔట్‌ఫాల్ స్లూయిజ్‌ల పునర్నిర్మాణానికి నిధులు సాధించడం సంతృప్తినిచ్చిందన్నారు.
జనసేన తరఫున పోటీ చేసిన అభ్యర్థుల ఎంపికలో ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు ప్రాధాన్యతనిచ్చి గెలిపించడం ద్వారా బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కల్పించామని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు బడుగు, బలహీన వర్గాల ప్రజలు జనసేనకు అండగా ఉన్నారనే విషయాన్ని మరోసారి స్పష్టం చేశాయన్నారు.
ఇదే ఐక్యతతో కూటమి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ వంద శాతం స్థానాలను కైవసం చేసుకునేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం కోడూరు మండలంలో జనసేన తరఫున ఎంపీటీసీలుగా విజయం సాధించిన అభ్యర్థులను ఎమ్మెల్యే సత్కరించారు. కార్యక్రమంలో జనసేన మచిలీపట్నం పార్లమెంటు స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్త మండలి వెంకట్రామ్, కోడూరు మండల అధ్యక్షుడు మర్రె గంగయ్య, టౌన్ అధ్యక్షుడు కోట రాంబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.