జనసేన నాయకులు నవీన్ నిశ్చల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్ వెంకట సాయి
అనంతపురం ప్రతినిధి మేజర్ న్యూస్ :-అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల్లో 21వ డివిజన్ కార్పొరేటర్‌గా ఘన విజయం సాధించిన నర్రావుల వెంకట సాయి హిందూపురంలో రాజకీయ అనుభవజ్ఞులు, పెద్దలు, మాజీ ఆగ్రోస్ చైర్మన్, జనసేన పార్టీ నాయకులు బుక్కపట్నం నవీన్ నిశ్చల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆశీస్సులు తీసుకుని, తన విజయానంతరం చేపట్టబోయే ప్రజాసేవా కార్యక్రమాల గురించి వివరించారు.
అనంతరం 21వ డివిజన్ సమగ్ర అభివృద్ధి, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీరు, డ్రైనేజీ సమస్యల పరిష్కారం తదితర అంశాలపై నవీన్ నిశ్చల్‌తో చర్చించారు. ప్రజాప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించే క్రమంలో అనుసరించాల్సిన విధానాలు, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే అంశాలపై ఆయన విలువైన సలహాలు, సూచనలు స్వీకరించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ వెంకట సాయి మాట్లాడుతూ.. రాజకీయ, ప్రజాజీవితంలో విశేష అనుభవం కలిగిన పెద్దల ఆశీస్సులు, మార్గదర్శకత్వం తనకు ఎంతో స్ఫూర్తినిస్తాయని తెలిపారు. వారి సూచనలు, సలహాలను పాటిస్తూ 21వ డివిజన్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడంతో పాటు, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు.
మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..