ఎఫ్‌డీఏ ఓజెంపిక్, జెప్‌బౌండ్ మందులపై కొత్త కంటి ప్రమాద హెచ్చరికలు
సూర్య అంతర్జాతీయ డెస్క్: మధుమేహం నియంత్రణ మరియు బరువు తగ్గేందుకు విరివిగా ఉపయోగిస్తున్న ప్రముఖ జీఎల్‌పీ-1 (GLP-1) తరగతి మందులపై అమెరికా ఆహారౌషధ నియంత్రణ సంస్థ (US FDA) కీలక ఆదేశాలు జారీ చేసింది. నోవో నార్డిస్క్ సంస్థకు చెందిన 'ఓజెంపిక్' (Ozempic), 'వెగోవి' అలాగే ఎలీ లిల్లీ సంస్థకు చెందిన 'మౌంజారో', 'జెప్‌బౌండ్' (Zepbound) వంటి మందుల లేబుళ్లలో కొత్తగా కంటి సంబంధిత తీవ్ర ప్రమాద హెచ్చరికలను చేర్చాలని సోమవారం స్పష్టం చేసింది.
ఈ మందుల వాడకం వల్ల అసాధారణ మరియు తీవ్రమైన కంటి సమస్యగా భావించే 'నాన్-ఆర్టీరిటిక్ యాంటీరియర్ ఇస్కీమిక్ ఆప్టిక్ న్యూరోపతి' (NAION) ముప్పు పొంచి ఉందని ఎఫ్‌డీఏ హెచ్చరించింది. ఆప్టిక్ నరాలకు రక్త సరఫరా తగ్గిపోవడం వల్ల తలెత్తే ఈ పరిస్థితి, ఎటువంటి నొప్పి లేకుండా అకస్మాత్తుగా చూపు మందగించడానికి లేదా శాశ్వతంగా దృష్టి కోల్పోవడానికి దారితీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీనికి సంబంధించి మందుల లేబుల్స్‌లోని 'హెచ్చరికలు మరియు జాగ్రత్తలు' (Warnings and Precautions) విభాగంలో ఈ సరికొత్త ప్రమాద హెచ్చరికలను చేర్చాలని ఎఫ్‌డీఏ ఔషధ తయారీ సంస్థలను ఆదేశించింది. మందులు వాడుతున్న రోగులు ఎవరైనా అకస్మాత్తుగా చూపు కోల్పోవడం, దృష్టిలో అస్పష్టత లేదా మచ్చలు వంటి లక్షణాలను ఎదుర్కొంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న ఈ పాపులర్ వెయిట్ లాస్ మరియు డయాబెటిస్ మందులపై తాజా హెచ్చరికలు వైద్యవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.