భారత రాజ్యాంగ దినోత్సవం పై విద్యార్థులకు పోటీలు.
శెట్టూరు: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాక్ అసెంబ్లీ నిర్వహణలో భాగంగా శెట్టూరు మండల వనరుల కేంద్రంలో మండల స్థాయి వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మండల పరిధిలోని వివిధ ఉన్నత పాఠశాలలకు చెందిన 25 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. భారత రాజ్యాంగం ఆవిర్భావం, రాజ్యాంగ నిర్మాతల ఆశయాలు, ప్రజాస్వామ్య విలువలు, ప్రాథమిక హక్కులు, పౌరుల బాధ్యతలు, సమానత్వం, స్వేచ్ఛ వంటి అంశాలపై విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. విద్యార్థులు తమకు కేటాయించిన అంశాలపై ప్రసంగిస్తూ, వ్యాసరచన ద్వారా విషయ పరిజ్ఞానాన్ని చాటుకున్నారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆరుగురు విద్యార్థులను తదుపరి దశకు ఎంపిక చేసి వారికి క్విజ్ పోటీ నిర్వహించారు. ఈ పోటీల్లో లక్షమంపల్లి పాఠశాలకు చెందిన చరణ్ తేజ, చెర్లోపల్లి పాఠశాలకు చెందిన కుమలత, నవ్యశ్రీ ప్రతిభ కనబరిచి నియోజకవర్గ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని మండల విద్యాధికారి వి. శ్రీధర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటు దేశ చరిత్ర, రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, వేదికపై మాట్లాడే నైపుణ్యాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని తెలిపారు. ఎంపికైన ముగ్గురు విద్యార్థులు నియోజకవర్గ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని, అక్కడ విజయం సాధించిన విద్యార్థులను మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి ఎంపిక చేసి పంపనున్నట్లు వివరించారు. అనంతరం మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మండల విద్యాధికారి బహుమతులు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు వీరభద్ర, తిప్పేస్వామి, బయపరెడ్డి, శంకర్ గౌడ్, లక్ష్మి, శాంతి, అఫ్స తదితరులు పాల్గొన్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.