గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన..
• ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆత్మీయ పలకరింపు
• ప్రజల సమస్యలే ప్రాధాన్యం.. అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే పర్యటన
సూర్య, లక్షెట్టిపేట :
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు లక్షెట్టిపేట మండలంలోని పాత కొమ్ముగూడెం, కొత్త కొమ్ముగూడెం గ్రామాల్లో సంబంధిత అధికారులతో కలిసి పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలు, అభివృద్ధి పనులపై ప్రజలతో చర్చించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కొత్త కొమ్ముగూడెం ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
అదేవిధంగా ప్రజా ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల సంబరాల్లో భాగంగా లక్షెట్టిపేట మండలంలోని చందారం, పాత కొమ్ముగూడెం గ్రామాల్లో నూతన గృహప్రవేశాలు చేసుకున్న లబ్ధిదారుల ఇళ్లకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ దంపతులు వెళ్లి కుటుంబ సభ్యులను అభినందించారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి, మిఠాయిలు తినిపించి ఆశీర్వదించారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని, ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.