కూటమి విద్యారంగ ప్రగతికి దేశమే ఫిదా...తప్పుడు ప్రచారాలతో వైసీపీ దగా
సూర్య స్టేట్ బ్యూరో.
విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ (CII) పారిశ్రామికవేత్తల పెట్టుబడుల సదస్సు ఒక పండుగ వాతావరణంలో ఎంతో విజయవంతంగా కొనసాగుతోందని ఏపీ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్ పర్సన్ పీతల సుజాత పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, యువత భవిష్యత్తుకు ఈ సదస్సు ఒక బలమైన పునాది వేస్తోందని అభిప్రాయపడ్డారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవజ్ఞమైన సారథ్యాన్ని, మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వ ప్రతిభను విశ్వసించి దేశ విదేశాల నుండి ఎందరో పారిశ్రామికవేత్తలు విశాఖ సదస్సుకు తరలివచ్చారని ఆమె తెలిపారు. లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు ముందుకు రావడం తెలుగుదేశం ప్రభుత్వ పాలనపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని ఆమె అన్నారు. రాష్ట్రానికి వస్తున్న ఈ భారీ పెట్టుబడుల వల్ల ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందడమే కాకుండా, మన బిడ్డలకు, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించి బంగారు భవిష్యత్తు ఏర్పడుతుందని పీతల సుజాత ఆశాభావం వ్యక్తం చేశారు. సీఐఐ సదస్సు విజయవంతంగా జరుగుతుండటంతో రాష్ట్రంలోని యువత, ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అయితే, ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు ప్రజల దృష్టిని మళ్లించేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. సదస్సు విజయాన్ని అడ్డుకోవడానికి వైసీపీ తమ సోషల్ మీడియా వేదికలను ఉపయోగించుకుంటూ రకరకాల తప్పుడు ప్రచారాలు, కుట్రలకు పాల్పడుతోందని పీతల సుజాత గారు ఆరోపించారు. రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం కేవలం చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైన నాయకత్వంలోనే సాధ్యమైందని, ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించాలని చూసినా రాష్ట్ర అభివృద్ధి ఆగదని ఆమె స్పష్టం చేశారు. సీఐఐ సదస్సు విజయవంతాన్ని ఓర్వలేకనే విద్యారంగంపై వైసీపీ తప్పుడు ప్రచారం*
రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పారిశ్రామికవేత్తల సదస్సు విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేక, ప్రజల దృష్టిని మరల్చేందుకే వైసీపీ విద్యారంగంపై తప్పుడు ప్రచారానికి తెరలేపిందని ఏపీ మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన సీఐఐ సదస్సును కనీస చిత్తశుద్ధి లేకుండా తూతూమంత్రంగా నిర్వహించారు. ఆనాటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించాలనే ఆలోచన కానీ, యువతకు ఉపాధి కల్పించాలనే కమిట్‌మెంట్ కానీ లేకపోవడం వల్ల అసలు ఆ సదస్సు ఎప్పుడు జరిగిందో కూడా ప్రజలకు తెలియని పరిస్థితి నెలకొంది. కానీ నేడు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని కూటమి ప్రభుత్వం లక్షలాది కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించి, మన బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోందని పేర్కొన్నారు. విద్యారంగం గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని పీతల సుజాత స్పష్టం చేశారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరినీ చదివిస్తామని వారి అమ్మఒడి ఇస్తామని హామీ ఇచ్చి, కేవలం ఒక్కరికే అది కూడా అరకొరగా కొంతమందికి మాత్రమే రూ.13 వేలు వేసి విద్యార్థులను, తల్లిదండ్రులను జగన్ మోహన్ రెడ్డి మోసం చేశారు. గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో కనీస సదుపాయాలు కల్పించలేదు. టీచర్ల పోస్టులను భర్తీ చేయకపోగా, పిల్లలకు నాణ్యమైన భోజనం అందించలేదు. విద్యా సంవత్సరం సగం పూర్తయ్యే వరకు కూడా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌లు ఇవ్వకుండా విద్యావ్యవస్థను పూర్తిగా రాజకీయాలకు వేదికగా మార్చేశారని ఆమె ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు వచ్చాయని పీతల సుజాత కొనియాడారు. నేడు ప్రతి ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతూ, రాజకీయాలకు అతీతంగా పాఠశాలలను నడుపుతున్నామని తెలిపారు. విద్యార్థులకు సకాలంలో నాణ్యమైన పుస్తకాలు, యూనిఫామ్, బూట్లు, పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పిల్లలు కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా, నాణ్యమైన విద్యతో పాటు నైతిక విలువలను కూడా నేర్చుకునేలా విద్యాశాఖ కృషి చేస్తోందన్నారు. లోకేష్ గారి సారథ్యంలో నేడు ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థ దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తోందని, ప్రభుత్వ బడుల్లో చదివిన విద్యార్థులు నేడు పత్రికల మొదటి పేజీల్లో నిలిచేలా టాప్ ర్యాంకులు సాధించడమే ఇందుకు నిదర్శనమని పీతల సుజాత తెలిపారు.
మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యావ్యవస్థలో సమూల సంస్కరణలు..
ప్రభుత్వం ఏ మంచి పని చేసినా దాన్ని ఎలాగైనా పక్కదారి పట్టించడమే తమ జన్మహక్కు అన్నట్లుగా వైసీపీ ముందుగా ప్లాన్ చేసుకుని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని పీతల సుజాత మండిపడ్డారు. గత వైసీపీ పాలనలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు విద్యార్థులు రోడ్డెక్కని రోజు అంటూ లేదు. నాణ్యమైన విద్య లేదని, టీచర్లు పాఠాలు సరిగ్గా చెప్పడం లేదని, టీచర్ పోస్టులు భర్తీ చేయలేదని, భోజనం సరిగ్గా పెట్టడం లేదని నిత్యం ఏదో ఒక సమస్య ఉండేదని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో రూ.4,300 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టి వెళ్లిపోయారని పీతల సుజాత గుర్తు చేశారు. "నాడు జగన్ మోహన్ రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎగ్గొట్టడం వల్ల విద్యార్థులు, విద్యాసంస్థల యాజమాన్యాలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రజలెవరూ మర్చిపోలేదు. చిత్తశుద్ధి ఉన్న కూటమి ప్రభుత్వం ఆ బకాయిలన్నింటినీ తప్పకుండా తీరుస్తుంది. ప్రజలకు మంచి జరుగుతుంటే దాన్ని అడ్డుకోవడానికి డైవర్షన్ రాజకీయాలు చేయడం వైసీపీకి తగదని ఆమె అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విద్యావ్యవస్థలో సమూల సంస్కరణలు తెచ్చి, ఎక్కడా ఎలాంటి సమస్యలు లేకుండా లోకేష్ గారు విద్యాశాఖను ముందుకు నడిపిస్తున్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థ దేశానికే రోల్ మోడల్‌గా నిలవడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం. విద్యార్థులు చదువుకునే వయసులో రాజకీయాల వైపు వెళ్లకుండా, కండువాలు వేసుకోవద్దని ధైర్యంగా చెబుతూ పిల్లలకు మంచి విలువలు నేర్పిస్తున్నామని తెలిపారు. విద్యాశాఖతో పాటు ఐటీ రంగాన్ని కూడా బలోపేతం చేస్తూ, సీఐఐ సదస్సు వంటి కార్యక్రమాల ద్వారా, విదేశాలకు వెళ్లి మరీ ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తూ పెట్టుబడులు రప్పిస్తున్నారని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీకి అదనంగా మరో 5 లక్షలు కలిపి మొత్తం 25 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా లోకేష్ గారు నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. వైసీపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజల ఉజ్వల భవిష్యత్తును కాపాడటమే, మన బిడ్డలకు బంగారు బాట వేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పీతల సుజాత స్పష్టం చేశారు.