*రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలి*
నారాయణఖేడ్;నారాయణఖేడ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రాబోయే రోజుల్లో విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ శాఖ అధికారులతో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో విద్యుత్ సరఫరా పరిస్థితి, వ్యవసాయానికి అవసరమైన విద్యుత్, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు, ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం, విద్యుత్ లైన్ల మరమ్మతులు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగి విద్యుత్ వినియోగం అధికమయ్యే అవకాశం ఉన్నందున అధికారులు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని, గృహ వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఎక్కడైనా అంతరాయాలు ఏర్పడితే వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని, అవసరమైన చోట ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్ల మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజలకు, రైతులకు విద్యుత్ పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లాకు సంబంధించిన విద్యుత్ శాఖ అధికారులు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు