కూటమి ప్రభుత్వ మోసాలకు చరమగీతం పాడాలి: డాక్టర్ కృష్ణ చైతన్య
పోలాకి, సూర్య : ఎన్నికల ముందు ఇచ్చిన 'సూపర్ సిక్స్' హామీలను గాలికొదిలేసి ప్రజలను మోసం చేసిన ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ కృష్ణ చైతన్య పిలుపునిచ్చారు. నవంబర్ 5న జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా మబగాం గ్రామంలో నిర్వహించిన ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
హామీల అమలులో ప్రభుత్వం ఘోర వైఫల్యం :
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా మహిళలకు ఇస్తామన్న ఉచిత గ్యాస్ సిలిండర్ల ఊసే లేదని ఆయన విమర్శించారు. నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదా నెలకు ₹3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నట్టేట ముంచారని మండిపడ్డారు. అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సచివాలయ, వాలంటీర్ వ్యవస్థల ద్వారా కులమతాలు, రాజకీయాలకు అతీతంగా ఇంటికే చేరిన సంక్షేమ ఫలాలను కూటమి ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిందని ధ్వజమెత్తారు.
రైతాంగ సంక్షోభం – నింగినంటిన నిత్యావసర ధరలు :
నాడు వైఎస్సార్‌సీపీ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా నేరుగా గ్రామంలోనే విత్తనాలు, ఎరువులు అందేవని, కానీ నేడు రైతులు ఒక్క యూరియా బస్తా కోసం చెప్పుల లైన్లలో గంటల తరబడి నిలబడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాక్ మార్కెట్‌లో ఎరువులను అధిక ధరలకు అమ్ముతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నాడు జగనన్న హయాంలో కేజీ ₹20 పలికిన ఉల్లిపాయలు నేడు ₹50 నుండి ₹60 వరకు పెరిగాయని, పప్పులు, నూనెలు సహా అన్ని నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి:
పదవి ఉన్నా లేకపోయినా, అర్ధరాత్రి ఫోన్ చేసినా ప్రజలకు అందుబాటులో ఉంటూ నిస్వార్థ సేవ చేసిన వ్యక్తి చల్ల రామారావు అని డాక్టర్ కృష్ణ చైతన్య కొనియాడారు. నవంబర్ 5న జరిగే పోలింగ్‌లో మబగాం ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చల్ల రామారావును, అలాగే పోలాకి మండల జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చింతూ ప్రమీలను తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన గ్రామ మహిళలను, రైతులను, యువకులను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.