అభివృద్ధిలో మునిదేవునిపల్లి ముందడుగు! గ్రామాభివృద్ధికి సర్పంచ్ కృష్ణ ప్రత్యేక చొరవ
కొండాపూర్ ; కొండాపూర్ మండల పరిధిలోని మునిదేవునిపల్లి గ్రామం అభివృద్ధి బాటలో ముందుకు సాగుతోంది. గ్రామ సర్పంచ్ డి. కృష్ణ ప్రత్యేక చొరవతో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తూ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. శంకర్‌పల్లికి సమీపంలో ఉండటం, నార్సింగికి రహదారి అనుసంధానం, ఆహ్లాదకరమైన ప్రకృతి వాతావరణం కారణంగా గ్రామ శివారులో భారీ వెంచర్లు ఏర్పాటయ్యాయి. భవిష్యత్తులో నిర్మాణాలు ప్రారంభమైతే గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూరే అవకాశం ఉందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నిధుల కొరత ఉన్నా.. అభివృద్ధే లక్ష్యం
సర్పంచ్‌గా ఎన్నికైనప్పటి నుంచి గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కృష్ణ తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ, వీధి దీపాల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. ఎన్నో సంవత్సరాలుగా గ్రామానికి ఆధారంగా ఉన్న ఏకైక బావికి మరమ్మతులు చేయించామని పేర్కొన్నారు.గ్రామ పంచాయతీకి నిధుల కొరత ఉన్నప్పటికీ దాతల సహకారంతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. వినాయక నిమజ్జనం, దసరా పండుగలను ఘనంగా నిర్వహిస్తూ గ్రామంలో ఐక్యత, పండుగ వాతావరణాన్ని పెంపొందిస్తున్నామన్నారు.
ప్రజల నమ్మకమే బలం
ప్రజలు తనపై నమ్మకంతో సర్పంచ్‌గా గెలిపించారని, వారికి ఇచ్చిన మాట ప్రకారం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని కృష్ణ స్పష్టం చేశారు. తన పదవీకాలంలో మునిదేవునిపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు.ఉపసర్పంచ్ వరలక్ష్మి కిష్టారెడ్డి, పంచాయతీ కార్యదర్శి దినేష్, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత, గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తామని సర్పంచ్ కృష్ణ తెలిపారు. అధికారుల, ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను సమకూర్చేందుకు కృషి చేస్తామన్నారు.