telangana
ఎల్-నీనో ప్రభావాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలి..
సూర్య: రాజంపేట ;; రాజంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం ఎల్-నీనో ప్రభావాలు, వ్యవసాయంపై ముందస్తు కార్యాచరణపై మండల స్థాయి అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు కే. అపర్ణ మాట్లాడుతూ ఎల్-నీనో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
యాసంగి సీజన్‌లో నీటి లభ్యతను బట్టి వరికి బదులుగా తక్కువ నీటితో సాగయ్యే శనగ, జొన్న, ప్రొద్దుతిరుగుడు, కుసుమ, వేరుశనగ, కూరగాయల వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని తెలిపారు. దీనివల్ల నీటి వినియోగం తగ్గడంతో పాటు రైతులు నష్టాల బారిన పడకుండా ఆదాయం పొందే అవకాశం ఉంటుందన్నారు.
తహసీల్దార్ జానకి మాట్లాడుతూ రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని, మిషన్ భగీరథ నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని కోరారు. ఎంపీడీవో సూర్యాజీ మాట్లాడుతూ పశువులు ఉన్న రైతులు వీబీజీ రామ్‌జీ పథకం కింద ఒక ఎకరం వరకు పశుగ్రాసం సాగు చేసుకోవచ్చని సూచించారు. గ్రామ సర్పంచ్ దుబ్బని శ్రీకాంత్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ జొన్న, ప్రొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జోష్ణ ప్రియదర్శిని, విద్యుత్ శాఖ ఏఈ, పెద్దయిపల్లి సర్పంచ్ నరేష్, బసన్నపల్లి సర్పంచ్ ఏ. సంతోష్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్లు మల్లారెడ్డి, రాజిరెడ్డి, సీఈఓ వెంకటేశ్వర శర్మ, ఏఈవోలు రాణి, రజిత, అఖిల, బాలకిషన్, రైతులు పాల్గొన్నారు.