యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యమివ్వాలి - ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు
సూర్య-పెద్దపల్లి రూరల్: సూపర్ ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశమున్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని, యాసంగిలో వరికి బదులుగా మొక్కజొన్న, శనగ వంటి ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సూచించారు.
మంగళవారం పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాలతో పాటు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్, చందపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూగర్భ జలాలు అడుగంటుతున్న నేపథ్యంలో నీటి లభ్యతను బట్టి పంటల సాగుపై నిర్ణయం తీసుకోవాలన్నారు. రైతులు దళారుల బారిన పడకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని, సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నామని తెలిపారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ప్రతిపక్షాల తప్పుడు ఆరోపణలను నమ్మవద్దని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, సింగిల్‌విండో చైర్మన్ ముత్యాల నరేష్, మాజీ జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, మండల అధ్యక్షుడు కట్కూరి సుధాకర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, రైతులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.