రేణిగుంటలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారానికి తెర !
రేణిగుంట మేజర్ న్యూస్: రేణిగుంట మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రం 5 గంటలకు తెరపడింది. ప్రచారానికి చివరి రోజు కావడంతో కూటమి టీడీపీ బీజేపీ జనసేన, వైఎస్సార్‌సీపీ పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారాలు, ర్యాలీలు, సమావేశాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు చివరి ప్రయత్నాలు చేశారు. రేణిగుంట మండలంలోని పలు గ్రామాల్లో అభ్యర్థులు ఓటర్లను నేరుగా కలిసి తమకు మద్దతు తెలిపి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని హామీలిచ్చారు. దీంతో రేణిగుంట పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి నెలకొంది. మండలంలో మొత్తం 21 ఎంపీటీసీ స్థానాలు, ఒక జడ్పీటీసీ స్థానం ఉండగా, 17 ఎంపీటీసీ స్థానాలును కూటమి పార్టీలు ఏకగ్రీమ్ చేసుకున్నాయి. మిగిలిన నాలుగు ఎంపీటీసీ స్థానాలతో పాటు ఒక జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. రేణిగుంట-3, రేణిగుంట-5, సురప్పకేశం, గుత్తివారిపల్లి ఎంపీటీసీ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ప్రచార గడువు ముగియడంతో అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు ఇక ఓటర్ల తీర్పుపై ఆశలు పెట్టుకున్నారు. నవంబర్ 5న జరగనున్న పోలింగ్‌లో ఓటర్లు, ఎవరికి పట్టం కడతారన్నది రేణిగుంటలో ఆసక్తికరంగా మారింది.