భూసార పరిరక్షణతోనే అధిక దిగుబడులు
కొల్చారం;భూసారాన్ని కాపాడుకుంటూ పంటల సాగు చేపట్టాలని మండల వ్యవసాయ అధికారి శ్వేతకుమారి రైతులకు సూచించారు. కొల్చారం మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ లతా శ్రీశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో భూసుపోషణ, భూసంరక్షణపై 'ఖేతీ బచావో అభియాన్' కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు జొన్న, మొక్కజొన్న, కుసుమ, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, పచ్చిరొట్ట ఎరువులు, జీవ ఎరువులు, సూక్ష్మపోషకాలను వినియోగిస్తూ సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులను పాటించాలని తెలిపారు. తద్వారా భూసారం పెరిగి నేల ఆరోగ్యం కాపాడబడుతుందని వివరించారు.అలాగే మట్టి నమూనాల సేకరణ, పరీక్షల విధానం, వాటి ద్వారా కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. భూసార పరీక్షల ఆధారంగా పంటలకు అవసరమైన పోషకాలను అందించి, సమతుల్య ఎరువుల వినియోగం చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భూమేష్, రైతులు పాల్గొన్నారు.