అయ్యవారిపల్లి భూ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలి
* భూమి కొనుగోలుదారుడు వర్కల నాగరాజు
* అమ్మిన రైతు నుంచి కొనుగోలుదారులు, ఆక్రమణదారుల వరకు విచారించాలి
* తనకు పట్టా మార్పిడి చేయకుండా 11 మందికి ఎలా పట్టాలు ఇచ్చారు?
* అచ్చంపేట ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేత
ఉప్పునుంతల, సూర్య న్యూస్ :
అయ్యవారిపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 115లో 13.17 ఎకరాల భూ వ్యవహారంపై 2006 నుంచి 2026 వరకు జరిగిన లావాదేవీలపై సమగ్ర విచారణ చేపట్టి న్యాయం చేయాలని భూమి కొనుగోలుదారుడు వర్కల నాగరాజు అధికారులను కోరారు. మంగళవారం అచ్చంపేట ఆర్డీఓ కార్యాలయంలో సీనియర్ సహాయకులు రాజేశ్వర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. 2008లో మహమ్మద్ చాంద్ పాషా, మహమ్మద్ ఖజామియా నుంచి రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా భూమి కొనుగోలు చేసినట్లు తెలిపారు. అయితే అందులో 13.17 ఎకరాలు మిస్సింగ్ సర్వే నంబర్‌గా చూపించడంతో అప్పటి నుంచి పట్టా మార్పిడి కోసం మండల, జిల్లా స్థాయి అధికారులకు పలుమార్లు వినతులు అందజేస్తున్నా పరిష్కారం కాలేదన్నారు. తనకు పట్టా మార్పిడి జరగని భూమిపై 11 మంది ఇతర వ్యక్తులకు పట్టాలు ఎలా మార్పిడి చేశారో విచారించాలని ప్రశ్నించారు.భూమి విక్రయించిన రైతుల నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి లావాదేవీ, రిజిస్ట్రేషన్లపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను గుర్తించాలని, ఎలాంటి అన్యాయం జరగకుండా పూర్తి స్థాయి విచారణ అనంతరం న్యాయం చేయాలని ఉన్నతాధికారులను కోరారు.