ఖజానా ఖాళీ.. పంచాయతీల్లో పాలన కుదేలు!
ఝరాసంగం;గ్రామాల అభివృద్ధికి పునాదులుగా నిలవాల్సిన గ్రామ పంచాయతీలు నేడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో నిధుల కొరతతో పాలనాపరమైన సమస్యలు తీవ్రమవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు సకాలంలో అందక అభివృద్ధి పనులు మందగించగా, కనీస నిర్వహణ ఖర్చులకూ నిధులు సమకూర్చలేని పరిస్థితి నెలకొందని స్థానిక ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నిధుల కొరత.. అభివృద్ధికి ఆటంకం గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సౌకర్యాలు, పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు నిధులు అందుబాటులో లేకపోవడంతో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని సర్పంచులు చెబుతున్నారు. అత్యవసర పనులు చేయాల్సి వచ్చినా నిధుల కొరత అడ్డంకిగా మారుతోందని వాపోతున్నారు.రాష్ట్ర ఆర్థిక సంఘం నిధుల జాడేది?రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా గ్రామ పంచాయతీలకు అందాల్సిన నిధులు గత ఏడాది కాలంగా విడుదల కాలేదని స్థానిక ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు. దీంతో గ్రామాల్లో కనీస అవసరాలు తీర్చడం కూడా కష్టంగా మారిందని అంటున్నారు.15వ ఆర్థిక సంఘం నిధులు పాత బకాయిలకే!గతంలో విడుదలైన 15వ ఆర్థిక సంఘం నిధుల్లో ఎక్కువ భాగం ఇప్పటికే చేపట్టిన పనుల పెండింగ్ బిల్లుల చెల్లింపులకే వెచ్చించాల్సి వస్తోందని సర్పంచులు చెబుతున్నారు. 16వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలు వచ్చినప్పటికీ, నిధుల విడుదలపై స్పష్టత లేకపోవడంతో కొత్త పనులపై ఆశలు పెట్టుకోలేని పరిస్థితి నెలకొందని అంటున్నారు.పాత సర్పంచులకు బిల్లుల బెంగ.. కొత్తవారికి నిధుల కొరత!మాజీ సర్పంచులు తమ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు అందక ఆందోళన చెందుతుండగా, కొత్తగా బాధ్యతలు చేపట్టిన సర్పంచులు గ్రామాల్లో కొత్త పనులు చేపట్టేందుకు నిధులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పంచాయతీలకు వస్తున్న నిధుల్లో ఎక్కువ భాగం పాత బకాయిలు, విద్యుత్ బిల్లులు, పారిశుద్ధ్య నిర్వహణ, సిబ్బంది వేతనాలు, కార్యాలయ ఖర్చులకే సరిపోతున్నాయని సర్పంచులు చెబుతున్నారు. దీంతో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు వంటి కొత్త అభివృద్ధి పనులకు నిధులు మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాజీ సర్పంచులకు రెండు, మూడు విడతల్లో నిధులు అందగా, ప్రస్తుత సర్పంచులకు ఇప్పటివరకు ఒక విడత మాత్రమే అందిందని స్థానిక ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు.కనీస నిర్వహణకూ నిధుల కష్టాలు గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, వీధి దీపాల మరమ్మతులు, మిషన్ భగీరథ నీటి సరఫరా పంపుల మరమ్మతులు, ట్రాక్టర్ డీజిల్ ఖర్చులు, బహుళ ప్రయోజన కార్మికుల వేతనాలు వంటి రోజువారీ అవసరాలకు కూడా నిధుల కొరత ఏర్పడుతోందని తెలుస్తోంది. అత్యవసర పనుల కోసం కొందరు సర్పంచులు, కార్యదర్శులు సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు.ప్రభుత్వాలు మారినా నిధుల సమస్య గత ప్రభుత్వ హయాంలోనూ నిధుల విడుదలలో జాప్యం జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనూ గ్రామాల అభివృద్ధికి సరిపడా నిధులు అందడం లేదని సర్పంచులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగుల వేతనాలు, నిర్వహణ ఖర్చులకే నిధులు సరిపోతుండటంతో అభివృద్ధి పనులకు అవకాశం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం తక్షణమే స్పందించాల గ్రామ పంచాయతీలకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, రాష్ట్ర ఆర్థిక సంఘం, 16వ ఆర్థిక సంఘం నిధులను సకాలంలో విడుదల చేయాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి పంచాయతీల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.కరువు కష్టాలకు తోడు నిధుల కొరత.. పంచాయతీలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి: జీర్లపల్లి సర్పంచ్ అమరేశ్వరి శివమణికరువు పరిస్థితులతో గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో గ్రామ పంచాయతీలపై ఆర్థిక భారం మరింత పెరుగుతోందని జీర్లపల్లి సర్పంచ్ అమరేశ్వరి శివమణి అన్నారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ వంటి కనీస అవసరాలకే అధిక ఖర్చు అవుతోందని, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు ఆశించిన స్థాయిలో ఆర్థిక సహకారం అందడం లేదని అభిప్రాయపడ్డారు. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టడం సవాలుగా మారుతోందని తెలిపారు.కరువు పరిస్థితులను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని ఆమె కోరారు. రోజువారీ నిర్వహణ ఖర్చులతో పాటు పాత బిల్లుల చెల్లింపులు, కొత్త అభివృద్ధి పనుల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల అవసరాలకు అనుగుణంగా తగిన ఆర్థిక చేయూత అందిస్తేనే ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు గ్రామీణ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం సాధ్యమవుతుందని అమరేశ్వరి శివమణి పేర్కొన్నారు.