మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్ల పర్యవేక్షణ.....
విజయనగరం, సూర్య : విజయనగరం జిల్లాలో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్, బొబ్బిలి మున్సిపాలిటీ, నెల్లిమర్ల నగర పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలైన విజయనగరం రాజీవ్ స్టేడియం, నెల్లిమర్ల సి.కే.ఎం.జి.జే. కళాశాల వద్ద పోలీసుశాఖ చేపట్టిన భద్రతా ఏర్పాట్లును జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ స్వయంగా పర్యవేక్షించారు.
నెల్లిమర్ల సి.కే.ఎం.జి.జె. కాలేజ్, విజయనగరం పట్టణంలోని రాజీవ్ క్రీడా ప్రాంగణం, అనధికార వ్యక్తులు ఎవ్వరూ కౌంటింగ్ కేంద్రాలవైపు వెళ్లకుండా పట్టణంలో ఏర్పాటు చేసిన బ్యారికేడ్లును జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ సందర్శించి, భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించి, ఓట్ల లెక్కింపు తీరును పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. బందోబస్తు నిమిత్తం ఇద్దరు అదనపు ఎస్పీలు, ఆరుగురు డీఎస్పీలు, 14మంది సిఐలు, ఎస్సైలు, సిబ్బందితో కలిపి సుమారు 600మందిని వినియోగిస్తున్నామని జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ మాట్లాడుతూ...
ఓట్ల లెక్కింపు చేపట్టే మూడు కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తుతోపాటు పరిసర ప్రాంతాలను డ్రోన్స్, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశామన్నారు.
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం గుర్తింపు కార్డులు కలిగిన అభ్యర్థులు, వారి ఎన్నికల ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే నిర్దేశిత ప్రాంతాల్లోకి అనుమతించాలన్నారు.
కౌంటింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగించే విధంగా ఎవ్వరు వ్యవహరించ రాదని, ఇతర ఏజెంట్లతో వాగ్వాదాలు, ఘర్షణలకు దిగకుండా పోలీసులు చర్యలు చేపట్టాలన్నారు.
కౌంటింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలు, వాటర్ బాటిల్స్, ఫుడ్ ప్యాకెట్లు, ఎలెక్ట్రానిక్ వస్తువులను, ఇతర నిషేధిత వస్తువులను అనుమతించ వద్దన్నారు.
కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో గుంపులుగా గుమిగూడడం, విజయోత్సవ ర్యాలీలు, బాణసంచా కాల్చడం, రెచ్చగొట్టే నినాదాలు చేయడం వంటి చర్యలకు అనుమతి లేదన్నారు.
ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అవసరమైన ప్రాంతాల్లో పికెట్స్, పెట్రోలింగ్, మొబైల్ పార్టీలను ఏర్పాటు చేసి, గస్తీ ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎన్నికల ఫలితాలపై ఎటువంటి వదంతులను నమ్మవద్దని, సోషల్ మీడియాలో ధృవీకరించని వార్తలు, రెచ్చగొట్టే పోస్టులు, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని ప్రజలకు సూచించారు. ప్రజలు విజ్ఞతతో, సంయమనంతో వ్యవహరించాలని, గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసుశాఖ చేపట్టే చర్యలకు సహకరించాలని జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ విజ్ఞప్తి చేశారు. జిల్లా ఎస్పీ వెంట ఎఆర్ అదనపు ఎస్పీ పి.కిరణ్ కుమార్, విజయనగరం డీఎస్పీ ఎస్.లక్ష్మణమూర్తి, పలువురు సిఐలు, ఎస్సైలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.