కోనసీమ జిల్లాలో 72.17 శాతం పోలింగ్.. ముమ్మిడివరంలో అత్యధికంగా 75.16 శాతం నమోదు!...
అమలాపురం మేజర్ న్యూస్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలు, ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో మొత్తం 91 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు.
మూడు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మొత్తం 98,035 మంది ఓటర్లకు గాను 70,750 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా 72.17 శాతం పోలింగ్ నమోదైంది.
పట్టణ స్థానిక సంస్థల వారీగా పరిశీలిస్తే.. అమలాపురం మున్సిపాలిటీలో 71.87 శాతం, రామచంద్రపురం మున్సిపాలిటీలో 70.73 శాతం పోలింగ్ నమోదైంది. ముమ్మిడివరం నగర పంచాయతీలో అత్యధికంగా 75.16 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ వెల్లడించారు.
ముమ్మిడివరం నగర పంచాయతీలోని 23 వార్డుల్లో 21,228 మంది ఓటర్లకు గాను 15,955 మంది ఓటు వేశారు. ఇందులో 7,878 మంది పురుషులు, 8,077 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.జిల్లాలోని మూడు పట్టణ స్థానిక సంస్థల్లో పోలింగ్ ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించారని పేర్కొన్నారు