హై ఓల్టేజ్ ఎస్ఎంసీ ఎన్నికల్లో డాన్ బొబ్బిలి గెలుపు
- కామవరపుకోట ఎస్ఎంసీ ఎన్నికల్లో 51 ఓట్ల తేడాతో ఘనవిజయం
- అసెంబ్లీ ఎన్నికలను తలపించిన పోరు
- సీఐ, ఇద్దరు ఎస్సైలు, 22 మంది పోలీసులతో బందోబస్తు
- జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే జోక్యం చేసుకున్నా తప్పని ఎన్నిక
కామవరపుకోట, మేజర్‌న్యూస్ : ఒక అసెంబ్లీ ఎన్నికలా కురుక్షేత్రాన్ని తలపించేలా జరిగిన కామవరపుకోట హైస్కూల్ ప్లస్ ఎస్ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మండల క్లస్టర్ ఇన్‌చార్జ్, తాజా ఎస్ఎంసీ చైర్మన్ డాన్ దివాకర్ బొబ్బిలి తన ప్రత్యర్థి బొల్లుబోయిన ప్రసాద్‌పై 51 ఓట్ల తేడాతో విజయం సాధించారు. పోలైన ఓట్లలో డాన్‌కు 250, ప్రసాద్‌కు 199 ఓట్లు పోలయ్యాయి. ఎప్పుడో 23 ఏళ్ల క్రితం 2003లో ఇదే కామవరపుకోట ఎస్ఎంసీకు ఎన్నికలు జరిగాయి. మళ్లీ ఇన్నేళ్లకు రాజకీయ జోక్యంతో హై ఓల్టేజ్ థ్రిల్లర్‌ను తలపించేలా ఈ ఎన్నికలు జరిగాయి. డాన్ దివాకర్ బొబ్బిలి, బొల్లుబోయిన ప్రసాద్ ఇద్దరు తెరమీద పోటీ పడినా వీరికి తెరవెనక డాన్‌కు ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధి, ప్రసాద్‌కు కామవరపుకోటకు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి మద్దతు పలకడంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. మూడు రోజుల క్రితం కోరం లేక ఎన్నిక వాయిదా పడగా శనివారం ఉదయం నుంచే ఏం జరుగుతుందా ? అన్న ఉత్కంఠ నెలకొంది. టీడీపీలోనే రెండు వర్గాలకు చెందిన గ్రూపుల మధ్య పోటీ జరగడం, సాక్షాత్తు ఎమ్మెల్యే సొంగా రోషన్‌కుమార్, జిల్లా టీడీపీ అధ్యక్షులు బడేటి చంటి జోక్యం చేసుకున్నా ఎన్నిక జరగడంతో నియోజకవర్గ వ్యాప్తంగా అందరూ కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూశారు. నియోజకవర్గ స్థాయిలో తమ బలాబలాలను మోహరించడంతో పాటు శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం తెల్లవారు ఝాము వరకు నోట్ల కట్టలు కూడా తెగాయి. కొందరికి అయితే ఇరువైపులా ఓటుకు రు. 3 వేలు గిట్టిందంటే ఏ స్థాయిలో డబ్బు పంపకాలు జరిగాయో తెలుస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికల్లో విద్యార్థుల తల్లిదండ్రులు ఓటర్లుగా ఎండలో బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మామూలు స్కూలు ఎన్నికలలో చేతులు ఎత్తే విధానం ఉండగా ఇక్కడ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరిపించడం విశేషం.
సీఐ, ఇద్దరు ఎస్.ఐలు, 22 మందితో పటిష్ట బందోబస్తు :
ఎన్నక తీవ్రత నేపథ్యంలో జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎంవి. సుభాష్ నేతృత్వంలో తడికలపూడి ఎస్.ఐ వల్లీ పద్మ, జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ ఎస్.ఐ కుటుంబరావుతో పాటు సర్కిల్ పరిధిలో నాలుగు స్టేషన్ల నుంచి 22 మందికి పైగా పోలీసులతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహించారు.
డాన్ మద్దతుదారుల సంబరాలు :
ఎన్నికల ఫలితం తర్వాత డాన్ మద్దతుదారుల ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. అనంతరం డాన్ మాట్లాడుతూ రెండేళ్ల పాటు తాను స్కూల్ కమిటీ చైర్మన్‌గా ఎంతో అభివృద్ధి చేశానని.. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు తనకు మద్దతుగా నిలిచి మరోసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. కామవరపుకోట హైస్కూల్ ప్లస్‌ను జిల్లా స్థాయిలో ఉన్నత స్థానానికి తీసుకువెళతానని చెప్పారు.
వైసీపీ మద్దతుతో గెలిచారు.…
ఎన్నికల ఫలితం అనంతరం బొల్లుబోయిన ప్రసాద్ మాట్లాడుతూ చిన్న వ్యక్తిపై పెద్దలందరూ కలిసి వైసీపీ మద్దతు తీసుకుని నన్ను ఓడించారు. నైతిక విజయం నాదే అని తెలిపారు.
స్థానిక ఎన్నికల్లో ప్రభావం ?ఇప్పటికే కామవరపుకోట టీడీపీ రెండు గ్రూపులుగా చీలిపోగా... ఈ ఎన్నిక ఈ వర్గపోరుకు మరింత ఆజ్యం పోసినట్లైంది. స్థానిక ఎన్నికల్లోనూ రెండు వర్గాల మధ్య సయోధ్య ఉండేలా కనిపించడం లేదు. అది అంతిమంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం, కూటమి పార్టీల విజయావకాశాలను ప్రభావితం చేస్తుందా ? లేదా ? అన్నది చూడాలి.
సుభాష్ కామవరపు కోట