చిట్టమూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ అరెస్టును ఖండించిన ఎంపీ గురుమూర్తి
తిరుపతి ,రెవెన్యూ ,మేజర్ న్యూస్.
చి ట్టమూరు మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్ అక్రమ అరెస్టును ఖండించిన ఎంపీ గురుమూర్తి
ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ప్రతిపక్ష నేతలను అక్రమ అరెస్టులతో భయపెట్టడం దుర్మార్గం
అక్రమ అరెస్టుపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్న ఎంపీ
గూడూరు నియోజకవర్గం చిట్టమూరు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ శ్రీనివాసరెడ్డి అక్రమ అరెస్టును తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అరెస్టులు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని ఆయన విమర్శించారు.
ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కుతో పాటు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనే స్వేచ్ఛ ఉందని గురుమూర్తి స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకులపై పోలీసు వ్యవస్థను ప్రయోగించి వారిని భయభ్రాంతులకు గురిచేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద గుంపులు గుంపులుగా ఉన్న కూటమి కార్యకర్తలను నిలువరించలేని పోలీసులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై కేసులు పెట్టి వేధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అక్రమ అరెస్టుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నటు ఎంపీ వెల్లడించారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను అడ్డుకోవడం, అరెస్టులతో ఒత్తిడికి గురిచేయడం వంటి చర్యలు స్వేచ్ఛాయుతమైన ఎన్నికల నిర్వహణపై అనుమానాలు కలిగిస్తున్నాయని అన్నారు. ఎన్నికల్లో ప్రజలు తమకు నచ్చిన అభ్యర్థులను స్వేచ్ఛగా ఎన్నుకునే వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు పోలీసు యంత్రాంగంపై ఉందని గుర్తుచేశారు.
అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోలీసులు చట్టప్రకారం, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఎంపీ కోరారు.
చిట్టమూరు మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్ అరెస్టుకు సంబంధించిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి, చట్టవిరుద్ధంగా వ్యవహరించినట్లు తేలితే బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష గొంతుకను అణచివేయాలనే ప్రయత్నాలు ప్రజాస్వామ్యంలో ఎన్నటికీ ఫలించవని, వైఎస్సార్‌సీపీ ప్రజల పక్షాన నిలబడి వారి హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతుందని డాక్టర్ మద్దిల గురుమూర్తి స్పష్టం చేశారు.
కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి