పొదలకూరులో ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల పరిశీలన..
పొదలకూరు, మేజర్ న్యూస్ : పొదలకూరు మండలంలో పరిషత్ ఎన్నికలకు సంబంధించి శనివారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నుంచి పరిశీలన వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికల అధికారులు, పోలీసు శాఖ సమన్వయంతో వ్యవహరించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి సీహెచ్ విజయకుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నామినేషన్ల పరిశీలనలో ఆమోదం పొందిన అభ్యర్థుల వివరాలను మండల పరిషత్ కార్యాలయంలోని నోటీసు బోర్డులో ప్రదర్శించనున్నట్లు తెలిపారు.
27న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం.. పోటీ నుంచి తప్పుకోదలిచిన అభ్యర్థులకు ఈ నెల 27వ తేదీన ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. రిజిస్టర్డ్ రాజకీయ పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు అదే రోజు మధ్యాహ్నం 3 గంటలలోపు ఫారం-బి సమర్పించాలని సూచించారు. నామినేషన్లను ఉపసంహరించుకోని వారిని స్వతంత్ర అభ్యర్థులగా గుర్తించి ఎన్నికల నిబంధనల ప్రకారం గుర్తులు కేటాయించే ప్రక్రియ చేపడతామని పేర్కొన్నారు.
పటిష్ట పోలీసు బందోబస్తు.. పరిషత్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పురస్కరించుకుని పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు పర్యవేక్షణలో పొదలకూరు సీఐ గుత్తి వెంకట్రావు, ఎస్సై శివ రాకేష్ తమ సిబ్బందితో కలిసి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రణాళికాబద్ధంగా విధులు నిర్వహిస్తూ నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగేందుకు సహకరించిన అన్ని శాఖల అధికారులకు రిటర్నింగ్ అధికారి కృతజ్ఞతలు తెలిపారు.