telangana
కెరెల్లి గ్రామంలో విద్యుత్ సమస్య పరిష్కారానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాలు
వికారాబాద్, మేజర్ న్యూస్ :వికారాబాద్ నియోజకవర్గంలోని ధరూర్ మండలం కెరెల్లి గ్రామంలో విద్యుత్ సరఫరా సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు, రైతులు చేసిన విజ్ఞప్తిపై తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ వెంటనే స్పందించారు. గ్రామంలోని విద్యుత్ సమస్యను తన దృష్టికి తీసుకురాగా, సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రస్తుతం గ్రామంలో ఉన్న సబ్‌స్టేషన్ సామర్థ్యాన్ని పెంచాలని, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాలని గ్రామస్తులు, రైతులు స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందుల వల్ల వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరారు.దీనిపై స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గ్రామస్తులకు, రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందేలా చూడాలని అధికారులకు సూచించారు. సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ, త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.సమస్య పరిష్కారానికి స్పందించిన స్పీకర్‌కు కెరెల్లి గ్రామస్తులు, రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.