కూటమితో ప్రజలకు సుపరిపాలన
ఆమదాలవలస, సూర్య : కూటమి ప్రభుత్వ పాలనతో ప్రజలకు సుపరిపాలన అందుతుందని ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ తెలిపారు. ఆమదాలవలస ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నామన్నారు. ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ఘన విజయాన్ని అందించారని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన పాలన అందిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
పేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు గృహ నిర్మాణ కార్యక్రమాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు, నిర్మాణానికి సంబంధించిన సహాయాన్ని అందిస్తోంది. అర్హులైన పేద కుటుంబాలకు ఇంటి స్థలాలు, గృహ నిర్మాణానికి అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపడుతోందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు నీటి సరఫరా వ్యవస్థల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించడంతో పాటు విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, పేద, మధ్యతరగతి కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, రైతుల సంక్షేమానికి తోడ్పడటం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలు అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, వాటికి పరిష్కారాలు చూపిస్తూ, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు అభివృద్ధి కార్యక్రమాలను విస్తరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లడమే కూటమి ప్రభుత్వ సంకల్పం అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ తమ్మినేని చంద్రశేఖర్ ఉన్నారు.
రిపోర్టర్ : రాము, సరుబుజ్జి, ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా.