telangana
రూ.400 కోట్ల అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదు.. బహిరంగ చర్చకు సిద్ధం: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజ వర్ధన్ రెడ్డి
బషీరాబాద్, మేజర్ న్యూస్ :ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నాయకత్వంలో బషీరాబాద్ మండలంలో రూ.400 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే, కొందరు సీనియర్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ విమర్శలు చేయడం సరికాదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు సామాజిక న్యాయం ప్రాతిపదికన పదవులు కేటాయిస్తే అభ్యంతరాలు వ్యక్తం చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. బషీరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.గత ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వడం పార్టీ బాధ్యత అని పేర్కొన్నారు. ఇందులో భాగంగా బీసీ మహిళకు చైర్మన్ పదవి, ఎస్సీ వర్గానికి చెందిన శంకరప్పకు ఏఎంసీ వైస్ చైర్మన్ పదవి కేటాయించడంపై కొందరు సీనియర్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. సామాజిక న్యాయానికి ప్రాధాన్యమిస్తూ పార్టీ తీసుకున్న నిర్ణయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు.ఎన్నికల సమయంలో ఎవరు ఏ పార్టీకి మద్దతుగా పనిచేశారు, పార్టీ గెలుపు కోసం ఎవరు కృషి చేశారనే విషయం బషీరాబాద్ ప్రజలకు తెలుసని రాజవర్ధన్ రెడ్డి అన్నారు. పదవులు దక్కితేనే పార్టీలో కొనసాగుతామని, లేకుంటే పార్టీ మారతామనే ధోరణి సరికాదని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పార్టీ అధిష్ఠానం నిర్ణయాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని స్పష్టం చేశారు.బషీరాబాద్ మండలంలో గతంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుత ఎమ్మెల్యే హయాంలో చేపడుతున్న అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు రావాలని అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సీనియర్ నాయకులకు సవాల్ విసిరారు. అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలు, లెక్కలను ఆధారాలతో సహా వెల్లడించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఆరోపణలు చేసేవారు కూడా ఆధారాలతో ముందుకు రావాలని అన్నారు.మండలంలో రూ.400 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొంటూ, రాజకీయ విభేదాలతో అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించవద్దని రాజవర్ధన్ రెడ్డి కోరారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ బలోపేతానికి, ప్రజా సంక్షేమానికి, మండల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ శంకరప్ప, పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, సర్పంచ్ బసప్ప, డైరెక్టర్ నా రవి రాథోడ్, మండల స్థాయి నాయకులు లక్ష్మణ్, అను ప్రసాద్, డాక్టర్ నరసింహులు, మాజీ ఎంపీటీసీ రాజేందర్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: కాశం పాషా, బషీరాబాద్, వికారాబాద్ జిల్లా