telangana
భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి - రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు
సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి :గోదావరి పుష్కరాలు- 2027 లో భాగంగా పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, మండల తహసిల్దార్ రఫతుల్లా, మార్కెట్ కమిటీ చైర్మన్ బానేష్, జిల్లా దేవాదాయ అధికారి రవి లతో కలిసి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గోదావరి పుష్కరాలలో భక్తులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం దాదాపు 2 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు మంజూరు చేసిందని, పుష్కర ఘాట్ల నిర్మాణం, ప్రధాన దేవాలయాల అభివృద్ధి, పునర్నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలను విజయవంతం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సన్నద్ధమవుతోందని తెలిపారు. పట్టణంలోని కాలేజ్ రోడ్డులో గల గోదావరి తీరం వద్ద పుష్కర ఘాట్ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం చెన్నూర్ పట్టణంలోని గోదావరి తీరం వద్ద కొనసాగుతున్న పుష్కర ఘాట్ పనులను జిల్లా కలెక్టర్, చెన్నూర్ తహసిల్దార్ మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, చైర్మన్ పెద్దింటి పద్మ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి అజ్మత్ అలీ లతో కలిసి పరిశీలించారు. పుష్కర ఘాట్ ఏర్పాటు పనులను నాణ్యత ప్రమాణాలతో త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. మండల కేంద్రంలోని చెరువు వద్ద పర్యాటక ప్రాంత అభివృద్ధి అంశంపై పరిశీలించారు. పట్టణంలోని మదన పోచమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల, దేవాదాయ శాఖల అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.