జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కలను సాకారం చేస్తాం : సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
సూర్య ప్రతినిధి : రాష్ట్రంలో ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న జర్నలిస్టుల కలను సాకారం చేస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. చట్టపరమైన చిక్కులు లేని, నివాసయోగ్యమైన ప్రాంతంలో స్థలాలు అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని వెల్లడించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2008లో జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి భూముల కేటాయింపునకు ఉత్తర్వులు జారీ అయ్యాయని మంత్రి గుర్తుచేశారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతో ఈ ప్రక్రియ సుదీర్ఘకాలం నిలిచిపోయిందన్నారు. 2024 సెప్టెంబర్ 8న రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో హౌసింగ్ సొసైటీకి భూమిని అప్పగించినట్లు పేర్కొన్నారు. అయితే, సుప్రీంకోర్టు తుది ఉత్తర్వుల నేపథ్యంలో మరోసారి న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు.
జర్నలిస్టుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు సహచర మంత్రులతో చర్చించి ఈ అంశంపై సమగ్రంగా సమీక్షించినట్లు పొంగులేటి వెల్లడించారు. గతంలో ఎదురైన న్యాయపరమైన సమస్యలు పునరావృతం కాకుండా, జర్నలిస్టులు తమ కుటుంబాలతో గౌరవంగా జీవించేందుకు అనువైన ప్రాంతంలో స్థలాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు. గతంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు జరిగిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ వారి సొంతింటి కలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని పేర్కొన్నారు.