చికిత్స పొందుతూ మహిళ మృతి.
అనపర్తి, మేజర్ న్యూస్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గత నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న మహిళ మృతి చెందిన ఘటన అనపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనపర్తి మండలం పీఆర్సీ పురం గ్రామానికి చెందిన పాకలపాటి బుల్లెమ్మాయి (57) ఈ నెల 27వ తేదీ రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో తన భర్తతో కలిసి హోండా యాక్టివాపై దుప్పలపూడి గ్రామంలోని తన కుమార్తె ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో సర్వేశ్వర పౌల్ట్రీ సమీపానికి చేరుకోగానే వర్షం, బలమైన గాలుల ప్రభావంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. ఈ ప్రమాదంలో బుల్లెమ్మాయికి తలకు తీవ్ర అంతర్గత గాయాలయ్యాయి. వెంటనే ఆమెను అనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అనపర్తి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను అక్టోబర్ 31వ తేదీన తిరిగి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలో స్పందించలేదు. దీంతో వెంటనే అనపర్తి ఏరియా ఆసుపత్రికి తీసుకురాగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.ఈ ఘటనపై మృతురాలి కుమారుడు పాకలపాటి శ్రీను ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనపర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. అడిషనల్ ఎస్‌ఐ బి. దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో పీఆర్సీ పురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.