వినోబా బావే ఆశయాలను కొనసాగిద్దాం భూదాన్ ఉద్యమ స్ఫూర్తితో పేదలకు భూములు పంచాలి
పటాన్‌చెరు, ; పేదలు, నిరుపేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు, స్వాతంత్ర్య సమరయోధుడు ఆచార్య వినోబా బావే ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని సర్వోదయ మండల్ భూదాన్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎన్. రాజు ముదిరాజ్ పిలుపునిచ్చారు.ఆదివారం సంగారెడ్డి జిల్లా సర్వోదయ మండల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పటాన్‌చెరు లోని ఐపీలో ఆచార్య వినోబా బావే 44వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, వినోబా బావే సేవలను స్మరించుకున్నారు.అనంతరం ఎన్. రాజు ముదిరాజ్ మాట్లాడుతూ.. వినోబా బావే దేశవ్యాప్తంగా పర్యటిస్తూ భూమిలేని పేదల కోసం భూదాన్ ఉద్యమాన్ని చేపట్టారని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో సైతం వేలాది ఎకరాల భూములను భూదాన్ రూపంలో సేకరించి, వాటిని రిజిస్ట్రేషన్ చేయించి బడుగు బలహీన వర్గాలకు, నిరుపేదలకు పంపిణీ చేయాలనే గొప్ప సంకల్పంతో ఆయన కృషి చేశారని పేర్కొన్నారు.వినోబా బావే పూర్తి పేరు వినాయక్ నరహరి బావే అని, 1895 సెప్టెంబర్ 11న జన్మించారని, 1982 నవంబర్ 15న మహారాష్ట్రలోని వార్ధాలో తుదిశ్వాస విడిచారని తెలిపారు. ఆయన మరణించి 44 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి ఘనంగా నివాళులర్పించినట్లు చెప్పారు.వినోబా బావే ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నేటి యువతరంపై ఉందన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా యువత, ప్రజాసంఘాలు, కుల సంఘాల నాయకులు ఏకతాటిపైకి వచ్చి పేదలకు భూములు పంపిణీ చేసే భూదాన్ యజ్ఞంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమాజంలో సమానత్వం, శాంతి, అహింస విలువలను పెంపొందిస్తూ వినోబా బావే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్వోదయ మండల్ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఉప్పరి రవీందర్, జిల్లా ప్రతినిధి న్యాయవాది డాక్టర్ కిషన్ ముదిరాజ్, పటాన్‌చెరు స్థానిక కాంగ్రెస్ నాయకులు సడబోయిన రవి ముదిరాజ్, బోయిన్ శీను ముదిరాజ్, మల్లేశం, రామచంద్రపురం మండల సర్వోదయ మండల్ నాయకుడు అంబదాస్‌తో పాటు వివిధ కుల సంఘాల ప్రతినిధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు, కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం – అహింస – శాంతి వర్ధిల్లాలి.. వినోబా బావే ఆశయాలను కొనసాగిద్దాం.. భూదాన్ ఉద్యమ స్ఫూర్తిని చాటుదాం..