సర్పంచ్ ఎన్నికలకు సమాయత్తం కావాలి: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి, నవంబర్ 15, మేజర్ న్యూస్:
ఇటీవల జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సాధించిన అఖండ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని, త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు పట్టం కడుతూ 94 శాతం స్ట్రైక్ రేట్‌తో భారీ విజయాన్ని అందించారని పేర్కొన్నారు. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా నాయకులు బాధ్యతాయుతంగా పనిచేస్తూ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని సూచించారు. రానున్న సర్పంచ్ ఎన్నికల్లోనూ పార్టీ బలపరిచిన అభ్యర్థులందరినీ భారీ మెజార్టీతో గెలిపించి, ప్రతి పంచాయతీలో టీడీపీ జెండా ఎగురవేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పోలాకి చంద్రశేఖర్ రావు, కృష్ణ, ఎల్.ఎల్. నాయుడు, ఆసిరి నాయుడు, దండాసి తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.
రిపోర్టర్
గంట అప్పన్న