పుస్తక పఠనం తోనే విజ్ఞాన వికాసం.. కళ్యాణదుర్గం గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన.
..కళ్యాణదుర్గం: పుస్తక పఠనం మనిషి జీవితంలో విజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు ఆలోచనా విధానాన్ని మెరుగుపరుస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా వివిధ రంగాలకు చెందిన పుస్తకాలను చదివే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు. 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం కళ్యాణదుర్గం శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి హెచ్. శ్రీనివాసులు ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు రాజన్న, రామాంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరై పుస్తక ప్రదర్శనను సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రాజన్న మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన సంపదకు నిలయాలని, వాటిలో అందుబాటులో ఉన్న అపారమైన పుస్తక సంపదను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఎన్నో విలువైన పురాతన పుస్తకాలు గ్రంథాలయంలో అందుబాటులో ఉన్నాయని, వాటి ద్వారా చరిత్ర, సాహిత్యం, సంస్కృతి తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు గ్రంథాలయాలను నిరంతరం సందర్శిస్తూ పఠన అలవాటును పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. మరో ముఖ్య అతిథి ఉపాధ్యాయులు రామాంజనేయులు మాట్లాడుతూ పుస్తక ప్రదర్శనల వల్ల గ్రంథాలయంలో ఎలాంటి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయో విద్యార్థులకు అవగాహన కలుగుతుందని తెలిపారు. ప్రతి విద్యార్థి తనకు ఆసక్తి ఉన్న పుస్తకాలను ఎంపిక చేసుకుని చదవడం ద్వారా కొత్త విషయాలను తెలుసుకోవడంతో పాటు భాషా పరిజ్ఞానం, ఆలోచనా శక్తి, సాధారణ జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. గ్రంథాలయాధికారి హెచ్. శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి పుస్తకానికి ఒక పాఠకుడు ఉండాలనే లక్ష్యంతో విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలతో పాటు సాహిత్యం, విజ్ఞానశాస్త్రం, చరిత్ర, జీవిత చరిత్రలకు సంబంధించిన పుస్తకాలను కూడా చదవాలని సూచించారు. ఏ పుస్తకమూ తక్కువ కాదని, చిన్న పుస్తకాన్ని చదవడం ద్వారా కూడా విలువైన జ్ఞానాన్ని సంపాదించవచ్చని వివరించారు. పుస్తక పఠనం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, ఏకాగ్రత, వ్యక్తిత్వ వికాసం పెరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది కే. ఉమామహేశ్వరి, బాలచంద్ర, వసంత్తో పాటు 36 మంది విద్యార్థులు, గ్రంథాలయ పాఠకులు పాల్గొన్నారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన పుస్తకాలను విద్యార్థులు ఆసక్తిగా పరిశీలించారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.