ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడి వలస కూలి మృతి
బ్రతుకు దెరువు కోసం వస్తే...
ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడి వలస కూలీ మృతి.
కొందుర్గ్ (రంగారెడ్డి): ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడడంతో బ్రతుకు దెరువు కోసం వచ్చిన వలస కూలీ మృతి చెందిన సంఘటన కొందుర్గు మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. స్థానిక ఎస్సై బిఎస్ఎస్ వరప్రసాద్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా నుంచి గత ఐదు రోజుల క్రితం కొంతమంది కూలీలు రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల పరిధిలోని లూర్దునగర్ కు పత్తి తీసేందుకు వచ్చారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం కొందుర్గు నుంచి లూర్దునగర్ కు ట్రాక్టర్ ట్రాలీలో కూలీలు వెళ్తుండగా, మార్గమధ్యలో ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం ముందుకు రాగానే ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కూలీలలో ఆరు మందికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కర్నూలు జిల్లా దేవనకొండ మండల పరిధిలోని పోట్లపాడు గ్రామానికి చెందిన చాకలి కిష్టన్న (38) మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బ్రతుకు దెరువు కోసం సొంత రాష్ట్రాన్ని వదిలి మరో రాష్ట్రానికి వస్తే రోడ్డు ప్రమాదంలో కిష్టన్న మృతి చెందడంతో కూలీల కుటుంబాల్లో విషాదం నెలకొంది.
ఈరమొల్ల సత్యనారాయణ, మేజర్ న్యూస్.