మానకొండూరులో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం: రోడ్డుపై పడ్డ భారీ గ్రానైట్ రాయి!
సూర్య - మానకొండూర్ :మానకొండూర్ మండల కేంద్రంలోని చెరువుకట్ట వద్ద ఒక భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది. వరంగల్ వైపు నుంచి కరీంనగర్ వెళ్తున్న ఒక గ్రానైట్ లారీ.. ఓవర్ లోడ్ (పరిమితికి మించి) బండతో వేగంగా ప్రయాణిస్తూ మానకొండూరు చెరువుకట్ట వద్దకు చేరుకుంది. లారీ వేగంగా ఉండటం, లోడ్ ఎక్కువగా ఉండటంతో ఒక్కసారిగా అందులోని ఒక భారీ గ్రానైట్ రాయి లారీ నుండి కిందకు జారి కరీంనగర్-మానకొండూరు ప్రధాన రహదారిపై పడిపోయింది.ఆ సమయంలో రోడ్డుపై ఇతర వాహనాలేవీ రాకపోవడంతో ఒక పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పినట్లయింది. ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.ప్రధాన రహదారిపై భారీ గ్రానైట్ బండ పడటంతో వరంగల్ - కరీంనగర్ మార్గంలో సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న మానకొండూరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపించారు. రోడ్డుపై ఉన్న భారీ రాయిని తొలగించడానికి పోలీసులు కంప్రెసర్ యంత్రాన్ని రప్పించారు. దానికి రంధ్రాలు చేసి, చిన్న చిన్న ముక్కలుగా పగలగొట్టి రోడ్డుపై నుండి తొలగించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.రవాణా శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే గ్రానైట్ లారీలు ఇలా విచ్చలవిడిగా ఓవర్ లోడ్‌తో నడుస్తున్నాయని వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా భారీ బండలను తరలిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, తనిఖీలను ముమ్మరం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఓవర్ లోడ్ వాహనాలపై కఠిన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలని వారు వేడుకుంటున్నారు.