పోలీస్ అమరవీరుల స్మారకంగా మెగా రక్తదాన శిబిరం
- ప్రాణదానంతో సమానం రక్తదానం. కొవ్వొత్తుల ర్యాలీతో అమరవీరులకు నివాళి
సూర్య, నస్పూర్ :
పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడాలనే సంకల్పంతో నస్పూర్ శ్రీరాంపూర్ పోలీసులు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పోలీసుల సేవా స్ఫూర్తిని చాటుతూ మంగళవారం నస్పూర్ పట్టణంలోని మనోరంజన్ సముదాయంలో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో, స్థానిక కార్పొరేటర్ అగ్గు సాగర్ సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పోలీసు అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. నస్పూర్ సీఐ గోపతి రవీందర్ స్వయంగా రక్తదానం చేసి స్ఫూర్తిగా నిలిచారు.
ఈ సందర్భంగా శ్రీరాంపూర్ సీఐ ఆకుల అశోక్ మాట్లాడుతూ, రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర పరిస్థితుల్లో రక్తాన్ని అందించడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమాజ రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతోపాటు, వారి సేవా స్ఫూర్తిని కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు.
అనంతరం సీసీసీ కార్నర్ వద్ద సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలను స్మరించుకుంటూ కొవ్వొత్తులు వెలిగించి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ ఎస్‌ఐ తహసీనుద్దీన్, ఇన్‌స్పెక్టర్ రంజిత్, శ్రీరాంపూర్ ఎస్‌ఐ సంతోష్, పోలీసు సిబ్బంది, రెడ్‌క్రాస్ సొసైటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.