తుపాన్ వేళ బాధితులకు అండగా హోం మంత్రి అనిత!.
Kkఅనకాపల్లి, అక్టోబర్ 27, మేజర్ న్యూస్: ‘అర్నబ్’ తుపాను ప్రభావం నేపథ్యంలో అనకాపల్లి జిల్లా యంత్రాంగం, పోలీసు విభాగం అప్రమత్తమై సహాయక చర్యలను వేగవంతం చేశాయి. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత గారు సహాయక చర్యల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. బోయపాడు తుపాను పునరావాస కేంద్రాన్ని స్వయంగా సందర్శించి, అక్కడ ఆశ్రయం పొందుతున్న బాధితులతో మాట్లాడారు. వారికి అందుతున్న భోజన, వసతి, వైద్య సదుపాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధితులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని అక్కడే ఉన్న రెవెన్యూ అధికారులు, నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు, అడ్డురోడ్డు ఆర్డీవోలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గత అనుభవాల దృష్ట్యా వరద ముంపునకు గురయ్యే అనకాపల్లి రూరల్ పరిధిలోని వెంకుపాలెం, కుంచంగి గ్రామాలను అనకాపల్లి ఎస్డీపీవో పి.వి.వి. నరసింహారావు, రూరల్ సీఐ అశోక్ కుమార్, ఎస్సై రవికుమార్ పరిశీలించి, గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. బుచ్చెయ్యపేట మండలంలోని విజయరామరాజుపేట, వడ్డాది కాజ్‌వేలను ఎస్డీపీవో పి.వి.వి. నరసింహారావు, బుచ్చెయ్యపేట ఎస్సై మనోజ్ కుమార్ పరిశీలించి, నీటి ప్రవాహం పెరిగితే రాకపోకలను వెంటనే నియంత్రించేలా ఆదేశాలు ఇచ్చారు. నర్సీపట్నం ఎస్డీపీవో పి.శ్రీనివాసరావు, నక్కపల్లి రూరల్ సీఐ రామకృష్ణ, ఎస్.రాయవరం ఎస్సై రమేష్ రేవుపోలవరం గ్రామాన్ని సందర్శించి మత్స్యకారులకు సూచనలు చేశారు. భారీ వర్షాల కారణంగా లంకెలపాలెంలో గుడిసెల్లో నివసిస్తున్న 20 మందిని పరవాడ ఎస్సైలు భీమరాజు, మహాలక్ష్మి సహాయంతో గంగిరెడ్ల కాలనీలోని ఎంపీపీ పాఠశాల పునరావాస కేంద్రానికి తరలించారు. రెవెన్యూ శాఖ సహకారంతో వారికి ఆహారం, నిత్యావసరాలు అందించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు లంకెలపాలెం, రాంకీ జంక్షన్, పరవాడ సబ్‌స్టేషన్ ప్రాంతాల్లో జేసీబీలు, క్రేన్లు, చెట్ల కట్టర్లు, టిప్పర్లను పరవాడ డీఎస్పీ బి.మోహన్ రావు, సీఐ భాస్కరరావు పర్యవేక్షణలో సిద్ధంగా ఉంచారు. ఎలమంచిలి పట్టణ ప్రధాన రహదారిపై భారీ వృక్షం కొమ్మ విరిగిపడటంతో ఎలమంచిలి సీఐ ధనుంజయరావు, టౌన్ ఎస్సై సావిత్రి వెంటనే స్పందించి తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. తుపాను తీవ్రత తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా కోరారు.