" అక్రమ కేసులతో అరెస్టులను ఖండిస్తున్నాం - కాకాణి"
నెల్లూరు, మేజర్ న్యూస్ : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం, రామలింగాపురం లో అక్రమంగా మద్యం బాటిళ్లు కలిగి ఉన్నాడని , అక్రమ కేసులో ఇరికించిన అట్ల శ్రీనివాసులు రెడ్డి కుటుంబాన్ని గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురవయ్య తో కలిసి పరామర్శించి, ధైర్యం చెప్పిన, మాజీ కాకాణి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్థన్ రెడ్డి .
కాకాణి సమక్షంలో పలువురు వైకాపా లోకి చేరిక,
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ...
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుంది...
ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఎంతో కీలకమైనవని, స్థానిక సంస్థల ఎన్నికలలో చంద్రబాబు ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందని, ఏదో ఒక విధంగా పోలీసులను అడ్డుపెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందాలని చూస్తున్నాడని కాకాణి మండిపడ్డారు . గత రెండున్నర సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, ప్రజలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలను, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు గురించి, చెప్పి ప్రజలను ఓట్లు అడగాలని,చంద్రబాబు మాత్రం వాటన్నింటినీ వదిలిపెట్టి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, మోసం చేశారని,అభివృద్ధి సంక్షేమం కనబడకుండా కేవలం అవినీతికి పాల్పడుతూ వచ్చారని ఆరోపించారు.
ప్రజల వ్యతిరేకత..కూటమి ఓటమి ఖాయం..
గత రెండున్నర సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు ముఖం చూస్తేనే చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడిందని,అటువంటి కీలకమైన తరుణంలో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ గానీ, ఆ పార్టీకి అండగా ఉంటున్న ఇతర పార్టీలు గానీ విజయం సాధించే అవకాశాలు లేవని కాకాణి స్పష్టం చేశారు. ఈ ఓటమి భయంతోనే చంద్రబాబు నాయుడు అడ్డదారులు తొక్కుతున్నారని కాకాణి విమర్శించారు.
గూడూరులో అరాచకాలు, పోలీసుల తీరుపై కాకాణి ఆగ్రహం..
భారతదేశానికి స్వాతంత్ర్య వచ్చిన తర్వాత ఎన్నో సాధారణ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఎంతోమంది దిగ్గజాలు, యోధులు ఈ ప్రాంతానికి మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా పనిచేశారు గానీ, ఎప్పుడూ లేనివిధంగా ఇటువంటి అరాచక వాతావరణాన్ని గూడూరు ప్రజలు ఇప్పుడు చూస్తున్నారని కాకాణి ఆందోళన వ్యక్తం చేశారు.
బెదిరింపులు, దౌర్జన్యాలు అకృత్యాలు..
రాష్ట్రం లో నిత్యం అకృత్యాలు, అరాచకాలు, ఎక్కడ పడితే అక్కడ బెదిరింపులు, బ్లాక్‌మెయిలింగ్‌లు, ప్రలోభాలు జరుగుతున్నాయని కాకాణి మండిపడ్డారు.
పోలీసులే దొంగ కేసులు పెడుతున్నారు..
పోలీసులే స్వయంగా దొంగ కేసులు బనాయించడం, దొంగ చేష్టలు చేయడం, పోలీసులే దొంగలుగా మారితే, ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యత ఎవరిదని కాకాణి ప్రశ్నించారు. రామలింగాపురం గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అట్ల శ్రీనివాసులు రెడ్డిని దెబ్బతీసేందుకే కుట్ర చేశారని కాకాణి తెలిపారు. శ్రీనివాసులు రెడ్డి సతీమణి, సంపూర్ణమ్మ ఎంపీటీసీగా గెలుస్తారన్న కసితో, ఆయనపై అక్రమ కేసులు బనాయించేందుకు పోలీసుల జోక్యంతో నేరుగా మందు బాటిళ్లు తెచ్చి శ్రీనివాసులు రెడ్డి ఇంట్లో పెట్టి, లైట్లు ఆపేసిన తర్వాత అక్కడికి వెళ్లి సోదాలు చేసి మందు బాటిల్లు దొరికిపోయాయంటూ అన్యాయంగా కేసులు పెట్టడం దారుణమని ధ్వజమెత్తారు. అసలు లైట్ వేయడానికి కూడా భయపడేలా పోలీసులు నిస్సహాయంగా వ్యవహరించడం వెనుక ఉన్న మతలబు ఏంటని నిలదీశారు. మీరు ఇందులో భాగస్వాములు కాకపోతే విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు
ఒక డీఎస్పీ స్థాయి వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడానికి లేదని, కచ్చితంగా డ్రాప్ కావాల్సిందేనని, ఎన్ని సీట్లు కావాలంటే అన్ని సర్దుబాటు చేస్తానని ఫోన్లో మాట్లాడడంపై కాకాణి విస్మయం వ్యక్తం చేశారు. ఇంతకన్నా సిగ్గుమాలిన విషయం మరొకటి ఉండదని, చరిత్రలో ఎక్కడైనా ఒక డీఎస్పీ స్థాయి అధికారి ఇలా వ్యవహరించడం చూశామా అని ఆయన ప్రశ్నించారు. సమాజంలో పోలీసు వ్యవస్థకు ఉండాల్సిన మర్యాదను దిగజార్చేలా కొందరు పోలీస్ అధికారులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
చాణక్య నీతి, రాజనీతి గురించి డి.ఎస్.పి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని కాకాణి ఎద్దేవా చేశారు. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో చాణక్యుడు చెప్పాడని డిఎస్పి చెబుతున్నాడని, కాకి చొక్కా వేసుకునే అర్హత మీకు ఉందా అని విమర్శించారు.
అధికారంలో ఉన్నామనే అహంకారంతో చట్టాన్ని, వ్యవస్థలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్న తీరుపై ఉన్నత స్థాయి అధికారులు ఆలోచించాలని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కాకాణి హెచ్చరించారు
వైయస్ఆర్సీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేస్తే ఊరుకోం..
రాష్ట్రంలో వైయస్సార్సీపి నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిస్తున్న తీరుపై కాకాణి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు పన్నినా, బెదిరింపులకు పాల్పడినా వైఎస్ఆర్సిపి శ్రేణులు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.ప్రత్యర్థులు కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టి, గెలిస్తే దాన్ని నిజమైన విజయంగా భావిస్తున్నారా అని కాకాణి ప్రశ్నించారు. ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, పవన్ కళ్యాణ్ తదితరులు తాము అన్నీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని, ప్రజాస్వామ్య బద్ధంగా ఓట్లు వేయించుకునే దమ్ము వారికి లేదని విమర్శించారు. చేసిన అభివృద్ధి శూన్యం కాబట్టే ప్రజలు ఓడిస్తారనే భయం వారిలో ఉందని ఎద్దేవా చేశారు.
పోలీసు వ్యవస్థ దుర్వినియోగం..
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయించడం, ఇళ్లపై దాడి చేయడం లాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వాకాడు లో భక్తవత్సలరెడ్డి, చిట్టమూరులో సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి మీద, పెళ్ళకూరు లో కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి మీద, ఇలా అనేకమంది వైయస్ఆర్సీపీ నేతల మీద అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ కూడా ఇటువంటి బెదిరింపులకు భయపడరని, పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి గారి నుండి వారసత్వంగా వచ్చిన గుండె ధైర్యంతో ముందుకు సాగుతామని కాకాణి స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్య విరుద్ధం..
ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని, కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయించడం ప్రజాస్వామ్య విరుద్ధమని స్పష్టం చేశారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని, రేపు అనేది రోజు తప్పక వస్తుందని, ఆరోజు మీరు చేసిన దురాగతాలకు, ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
మహిళల పట్ల దురుసు ప్రవర్తన..
నామినేషన్ లో వేసేందుకు వెళుతున్న మహిళలను అడ్డుకోవడం, వారిపై గంజాయి బ్యాచ్ తో దాడులు చేయడం, నామినేషన్లు వేయకుండా భయభ్రాంతులకు గురిచేయడం వంటి చర్యలను తీవ్రంగా ఖండించారు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఇలాంటి సంస్కృతి చూసామా అన్నారు, రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు
అక్రమ కేసులపై పునఃసమీక్ష జరపాలి..
ఎస్పీ గారు ఇప్పటికైనావాస్తవాలు గుర్తించి, రాజకీయ కక్ష సాధింపు చర్యలతో పెట్టిన ఎఫ్‌ఐఆర్‌లు మరియు కేసులపై పునఃసమీక్ష జరపాలని మద్యం బాటిళ్లు ఎక్కడినుండి తెచ్చారు ,ఎవరు పెట్టారో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కొందరిని నేరస్తులుగా చిత్రీకరించి జైళ్లలో పెట్టారని, శ్రీనివాసులు రెడ్డి విషయంలోనూ ఇదే పునరావృతమైందని తెలిపారు. చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారుతారని, అధికారం ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాట్లాడతారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు మరియు కార్యకర్తలు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారని,పార్టీ కోసం ఎప్పుడూ ముందుంటారని, ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు.
సామాన్య ప్రజలకు విజ్ఞప్తి..
రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలను సామాన్య ప్రజలు,గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలే తగిన సమాధానం చెబుతారని కాకాణి హెచ్చరించారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలోనే ప్రజలకు రక్షణ..
చంద్రబాబు నాయుడికి ఇప్పటికే సుప్రీంకోర్టు ఒక చెంప పగలకొట్టిందని, మరో చెంపను వాయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందని కాకాణి పేర్కొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఇబ్బందులకు గురవుతారో, వారందరికీ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు, జిల్లా నాయకులు పూర్తిగా అండగా ఉంటారని భరోసా కల్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు విషయం తెలిశాక శ్రీనివాసులు రెడ్డి కుటుంబాన్ని కలిసి, "ధైర్యం చెప్పమని పంపారని . మేము అండగా ఉంటామని భరోసా కల్పించేందుకే తాము ఈ రోజు వచ్చామని కాకాణి స్పష్టం చేశారు. వైయస్ జగన్ గారి పాలనలో మాత్రమే సామాన్యులకు భద్రత ఉంటుందని తెలిపారు, స్థానిక ఎన్నికల్లో సంపూర్ణమ్మ లాంటి నాయకులు ఘనవిజయం సాధించేలా వైయస్సార్‌సీపీ శ్రేణులు పనిచేయాలని, శ్రీనివాసులు రెడ్డి అక్రమ అరెస్టు ను తీవ్రంగా ఖండిస్తున్నామని కాకాణి స్పష్టం చేశారు.