రైతులను అతలాకుతులం చేసిన తుఫాన్
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం అర్నబ్ తుఫాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.మంగళవారం మధ్యాహ్నం నుంచి ఈదురుగాలులతో కూడిన ఎడతెరిపిలేని వర్షం కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. కోతకు సిద్ధమవుతున్న వరి పైర్లు గాలుల తీవ్రతకు నేలవాలుతుండగా, వర్షపు నీరు పంట పొలాల్లో చేరడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వరి పంట కోత దశకు చేరుకుంటోంది. మరికొద్ది రోజుల్లో చేతికందుతుందని ఆశించిన పంటపై తుఫాను ప్రభావం పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నెలల తరబడి శ్రమించి, పెట్టుబడులు పెట్టి సాగు చేసిన వరి పైర్లు ఈదురుగాలులకు నేలవాలుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పంట పొలాల్లో వర్షపు నీరు చేరడంతో పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది.
పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి విపత్తు రూపంలో తుఫాను ముప్పు ఎదురుకావడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. మరోవైపు అర్నబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలుల కారణంగా చెట్లు విరిగిపడటం, విద్యుత్ స్తంభాలు దెబ్బతినడం, రహదారులపై నీరు చేరడం వంటి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. గాలులు వీచే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో, శిథిలావస్థలో ఉన్న భవనాల వద్ద ఉండకూడదని సూచిస్తున్నారు. తెగిపడిన విద్యుత్ తీగలను తాకకుండా, వాటికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరుతున్నారు.తుఫాను తీవ్రతను దృష్టిలో ఉంచుకుని స్థానికంగా ప్రజల భద్రతకు సంబంధించి ముందస్తు చర్యలు చేపడుతున్నారు. సంబంధిత అధికారుల ఆదేశాల మేరకు థియేటర్లు, వైన్‌షాపులు, కిరాణా దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థలను మూసివేయాలని సూచించారు. వర్షం, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అనవసరంగా రహదారులపై తిరగకుండా ఉండటమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.తుఫాను ప్రభావం ఉన్నంతవరకు రైతులు పొలాల్లోకి వెళ్లి ప్రమాదాలకు గురికావద్దని సూచిస్తున్నారు.