స్థానిక ఎన్నికల ఘటనలపై ఎస్ఈసీ విచారణ చేయించాలి - మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
నెల్లూరు, మేజర్ న్యూస్ :
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం పోలీసుల సాయంతో చేసిన దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఆధారాలు సమర్పించామని, వాటిపై సమగ్ర విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటికి వస్తాయని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్ఈసీ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మగా మారిందని, అందుకే తాము న్యాయస్థానాల్ని ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. ఈ దాడులు, బెదిరింపులకు వైఎస్సార్సీపీ భయపడబోదని, న్యాయస్థానాల్లోనే దీనిపై తేల్చుకుంటామని కాకాణి గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు
ప్రెస్ మీట్లో కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంకేమన్నారంటే :
ఎస్ఈసీ విచారణ చేయిస్తే వెలుగులోకి వాస్తవాలు :
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న దాడులు, దౌర్జన్యాలు, నామినేషన్ల ఉపసంహరణలు, బెదిరింపులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ విచారణ చేయించాలి. ఇవన్నీ వాస్తవాలా ? కాదా ? అన్నదానిపై విచారణ చేయిస్తే, ఇవి వాస్తవాలు అని తేలితే, ఆ అధికారుల మీద ఏం చర్యలు తీసుకుంటారు, ప్రలోభపెట్టిన నాయకుల మీద ఏం చర్యలు తీసుకుంటారు, దీని వెనుక ఉన్న కీలకమైన వ్యక్తుల మీద ఏం చర్యలు తీసుకుంటారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే మేం న్యాయస్దానాన్ని ఆశ్రయించాం. ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు, ఈ వ్యవస్థల మీద మాకు నమ్మకం లేదు. ఇవాళ జరుగుతున్న తంతు చూస్తే రేపు ఎన్నికలు, కౌంటింగ్ సజావుగా సాగుతుందన్న నమ్మకం లేదు. ఇన్ని అడ్డదారులు తొక్కి సాధించిన దాన్ని విజయం అంటారా అని ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రజల ఓట్లతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, ప్రజల ఓట్లతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి , వీటన్నింటినీ పక్కనబెట్టి ఆ ప్రజల ఓటు హక్కును హరించే విధంగా వ్యవహరిస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు.
ఎస్ఈసీ చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటమే :
నేను అభ్యర్ధిగా ఎంపిక చేసిన వ్యక్తి ఉండాలి తప్ప, మిగతా వాళ్లు ఉండకూడదంటూ వారి హక్కుల్ని హరిస్తున్నారు. వైఎస్సార్సీపీ రాబోయే రోజుల్లో దీనిపై న్యాయపోరాటం చేస్తుంది. మీరు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా మేం భయపడే వ్యక్తులం కాదు. వాస్తవాలను ప్రజలకు వివరిస్తాం. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. దాడుల వీడియోలు రికార్డు చేసిన వారిపై చర్యలు తీసుకోవడం మానుకుని, కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలి. అధికారులు ప్రభుత్వం చెప్పిన మాటలకు తలూపకుండా స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాం. ఈ ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న వ్యవస్థలను భ్రష్టు పట్టించేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ప్రభుత్వం చెప్పినదానికి డూడూ బసవన్నలా తలూపే పరిస్ధితి ఏర్పడుతోంది. కాబట్టి ప్రజల్లో అపహాస్యం అవుతున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ తమ ప్రతిష్ఠ పెంచుకోవాలంటే.. మేం ఇస్తున్న ఆధారాలపై పూర్తిస్దాయిలో విచారణ జరిపించాలి. మా మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాడులు చేశారు, కింద పడేశారు. దీనికి బాధ్యులపై లోతుగా దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కమిషన్ పై ఉంది. రాష్ట్రంలో ఇలాంటి దౌర్భాగ్య పరిస్ధితుల్లో ఎన్నికలు జరిగాయన్న అపప్రద మూటగట్టుకోవద్దు. ఎక్కడా అక్రమాలు జరగకుండా కమిషన్ నిష్పక్షపాతంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలి. అలాగే తాము ఇచ్చిన ఆధారాలను పరిశీలించి బాధ్యులైన పాత్రధారులు, సూత్రధారులతో పాటు, దీని వెనుక ఎంత పెద్ద వారు ఉన్నా కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.