తుఫాన్ ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారుల సూచనలు పాటించాలి
మెళియాపుట్టి. అక్టోబర్ 27. మేజర్ న్యూస్...
తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టెక్కలి ఆర్డీవో పి.కృష్ణమూర్తి సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మంగళవారం మెళియాపుట్టి మండలం రట్టిణి గ్రామాన్ని సందర్శించిన ఆయన వాతావరణ పరిస్థితులను పరిశీలించి గ్రామస్థులకు పలు సూచనలు చేశారు.తుఫాన్ ప్రభావంతో వర్షాలు తీవ్రతరం అయ్యే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాలు కురుస్తున్న సమయంలో అనవసరంగా బయటకు వెళ్లరాదని, ఈదురుగాలులు వీచే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదని తెలిపారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు.గ్రామాల్లో ఏవైనా సమస్యలు తలెత్తినా, వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదురైనా వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అధికారులు ఎప్పటికప్పుడు అందించే సూచనలు, హెచ్చరికలను పాటిస్తూ తుఫాన్ ప్రభావం నుంచి సురక్షితంగా ఉండాలని గ్రామస్థులకు వివరించారు. ఈ పర్యటనలో తహసీల్దార్ రాము, ఎస్సై మహమ్మద్ అమీర్ అలీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.