గంభీరం రిజర్వాయర్ వద్ద అప్రమత్తంగా ఉండాలి
ఆనందపురం, సూర్య: తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఆనందపురం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆనందపురం పోలీసు స్టేషన్ సీఐ వీవీసీఎం ఎర్రం నాయుడు సూచించారు. ముఖ్యంగా గంభీరం రిజర్వాయర్ పరిసర ప్రాంతాల ప్రజలు, మత్స్యకారులు, బోణి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు ఈ సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో రిజర్వాయర్‌లో చేపల వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు. నీటి ప్రవాహం అధికంగా ఉండే ప్రాంతాలు, రిజర్వాయర్ గట్లు, ఇతర ప్రమాదకర ప్రదేశాల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాల కారణంగా రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరిగే అవకాశం ఉన్నందున పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లలను రిజర్వాయర్లు, నీటి కాలువలు, చెరువుల వద్దకు వెళ్లనివ్వకూడదన్నారు. భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే సమయంలో చెట్లు, విద్యుత్తు స్తంభాలు, పాత భవనాల సమీపంలో ఉండకూడదని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. అధికారులు జారీ చేసే హెచ్చరికలను పాటిస్తూ, అవసరమైన సందర్భాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సీఐ సూచించారు. వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారాన్నే విశ్వసించాలని, ప్రజల ప్రాణభద్రతకు ప్రాధాన్యమిస్తూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.