ఉపాధ్యాయుల సేవలు సమాజానికి ఎంతో విలువైనవి: ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి
దోమ, మేజర్ న్యూస్: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, వారి సేవలు సమాజానికి అమూల్యమైనవని పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి అన్నారు. దోమ మండల పరిధిలోని తిమ్మాయిపల్లి ఎస్‌డీ గార్డెన్‌లో నిర్వహించిన మండల ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యారంగంలో విశేష సేవలందిస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరిచేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారు అన్ని రంగాల్లో రాణించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఉపాధ్యాయులు పాఠ్యాంశాల బోధనతో పాటు విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.అనంతరం ఉపాధ్యాయులు ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో విద్యార్థులు, కళాకారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వారి ప్రతిభను అభినందించిన ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: చాపల బద్రి, దోమ, వికారాబాద్ జిల్లా.