తుఫానుతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..తహశీల్దార్ నరేశ్
మణుగూరు ఆర్ సి సూర్య;
తుఫాను మరియు భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మరియు సబ్-కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం మణుగూరు ఎంపీడీవో కార్యాలయంలో మండల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తహసీల్దార్,ఎంపీడీవో మరియు సీ.ఐ మణుగూరు ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై చర్చించారు.ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల్లో దండోరా, మైకుల ద్వారా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, గోదావరి నదిలో చేపల వేట, ఇసుక తవ్వకాలు, లోతట్టు ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు వెళ్లకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. నదులు, వాగులు, కల్వర్టులు దాటకుండా ప్రజలకు హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించారు.
వరద ముప్పు ఉన్న ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు మరియు ప్రమాదకర ప్రదేశాలను గుర్తించి అవసరమైన చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేయాలని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన రవాణా, సహాయక ఏర్పాట్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు.గ్రామపంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు జీపీఓలు గ్రామస్థాయిలో అందుబాటులో ఉంటూ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. తహసీల్దార్లు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు తమ హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండి, ఎటువంటి నష్టం జరగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
తుఫాను, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే సూచనలు తప్పనిసరిగా పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా కోరారు.
పొనగంటి కృష్ణ మణుగూరు ఆర్ సి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా