టీజీ మోడల్ స్కూల్ గ్రౌండ్ ను రక్షించండి జాతీయ రహదారి అలైన్మెంట్ తో స్కూల్ మనుగడకే ముప్పు
కోహెడ ; కోహెడ ఎన్ హెచ్ 760 డిజి రహదారి అలైన్మెంట్ లో మార్పుల వల్ల నాగ సముద్రాల గ్రామంలోని టీజీ మోడల్ స్కూల్ గ్రౌండ్ లేకుండా పోతుందని, మోడల్ స్కూల్ కు దూరంగా అలైన్మెంట్ మార్చాలని గ్రామస్తులు మంత్రి పొన్నం ప్రభాకర్కు విన్నవించారు. హైదరాబాదులోని మినిస్టర్ క్వాటర్స్ లో మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. జాతీయ రహదారి వల్ల పాఠశాలకు జరుగుతున్న నష్టాన్ని మంత్రికి వివరించారు. రామాయంపేట నుండి ఎల్కతుర్తి వరకు జాతీయ రహదారి (ఎన్ హెచ్ 760 డి జి) నిర్మాణ పనుల్లో భాగంగా నాగ సముద్రాల గ్రామం వద్ద గతంలో వెల్లడించిన అలైన్మెంట్ కాకుండా కొత్తగా అలైన్మెంట్ మార్చి గ్రామంలో ఉన్న మోడల్ స్కూల్ ఆటస్థలం మధ్య నుండి మార్చినట్లు వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ అలైన్మెంట్ అమలు అయితే స్కూలుకు ఆటస్థలం లేకుండా కనుమరుగవుతుందని, పాఠశాల మనుగడకే దెబ్బ ఉందని పేర్కొన్నారు. కోహెడ మండల వ్యాప్తంగా 20 గ్రామాల నుండి ఈ పాఠశాలలో దాదాపు 600 మంది విద్యార్థులు చదువుతున్న నేపథ్యంలో వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రహదారి అలైన్మెంట్ మార్పు కోసం కృషి చేయాల్సిందిగా కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ వెంటనే క్షేత్రస్థాయి పరిశీలన చేసి అవకాశాలను పరిశీలించాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. వినతి పత్రం సమర్పించిన వారిలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శెట్టి సుధాకర్, మాజీ అధ్యక్షులు మంద ధర్మయ్య, ప్రముఖ న్యాయవాది యాల్ల శ్రీనివాస్ రెడ్డి, గ్రామస్తులు చింతలపల్లి భాస్కర్ రెడ్డి, తూముల ఆంజనేయులు, తుంగ సత్తయ్య, మంగళారపు లక్ష్మణ్, సుదగొని మధు, పారునంది కరుణాకర్ సాయి, పస్తం రాజు తదితరులు ఉన్నారు.