తాగునీరు ,సాగునీటికి తప్పని తిప్పలు!
గణపురం, మేజర్ న్యూస్, సింగరేణి ఓపెన్‌కాస్ట్-3 ప్రభావిత గ్రామాల్లో తాగునీరు, సాగునీటి సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓసీ-3లో సుమారు 345 అడుగుల లోతు వరకు తవ్వకాలు చేపట్టడం వల్ల భూగర్భ జలాలపై ప్రభావం పడుతోందని, దీంతో గ్రామాల్లోని బోర్లు, వ్యవసాయ బావులు, చెరువుల్లో నీటి లభ్యత తగ్గుతోందని పరశురాంపల్లి సర్పంచ్ ఉడత సాంబయ్య యాదవ్, నగరంపల్లి సర్పంచ్ కొడారి హైమావతి–ధనుంజయ యాదవ్ పేర్కొన్నారు. ఓపెన్‌కాస్ట్ తవ్వకాల ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని, నిరంతరం నీటిని అందించే బోరుబావుల నుంచి సైతం నీరు సరిగా రాక పంట పొలాలు ఎండిపోతున్నాయని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నీరు అందించిన బోర్లు, బావుల్లో ప్రస్తుతం ఆశించిన స్థాయిలో నీరు లభించడం లేదని తెలిపారు. చెరువుల్లోనూ నీటి నిల్వలు తగ్గడంతో వ్యవసాయానికి అవసరమైన నీటిని అందించుకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. పంటల సాగు కోసం పెట్టిన పెట్టుబడులు వృథా అవుతాయనే ఆందోళన రైతుల్లో నెలకొందని పేర్కొన్నారు. సాగునీటి సమస్యతో పాటు గ్రామాల్లో తాగునీటి అవసరాలు తీర్చుకోవడం కూడా సవాలుగా మారుతోందని సర్పంచులు తెలిపారు. బోర్లలో నీటి లభ్యత తగ్గడంతో ప్రజలు తాగునీటి కోసం ప్రత్యామ్నాయ మార్గాలపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పారు. ఓపెన్‌కాస్ట్ కార్యకలాపాల ప్రభావాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి, భూగర్భ జలాల పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఓసీ-3 ప్రభావిత గ్రామాల్లోని బోర్లు, బావులు, చెరువుల నీటి మట్టాలను అధికారులు పరిశీలించాలని సర్పంచులు కోరారు. తాగునీరు, సాగునీటి సమస్యల పరిష్కారానికి సింగరేణి యాజమాన్యం, సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఓపెన్‌కాస్ట్ తవ్వకాల ప్రభావంతో రైతులు నష్టపోకుండా, పంట పొలాలు ఎండిపోకుండా, గ్రామస్థులకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కార మార్గాలను అన్వేషించాలని వారు డిమాండ్ చేశారు.
రిపోర్టర్ ,ఎల్లయ్య ,గణపురం ,జయశంకర్ భూపాలపల్లి జిల్లా