ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
మెలియాపుట్టి, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఇందులో భాగంగా మెలియాపుట్టి మండలం మర్రిపాడు సి పంచాయతీ పరిధిలోని సున్నిత గ్రామమైన బంజీరులో శనివారం సీఐ వెంకటరావు, ఎస్సై మహమ్మద్ అమీర్ అలీ పర్యటించారు. గ్రామస్థులతో మాట్లాడి ఎన్నికల నిర్వహణ, నిబంధనలపై అవగాహన కల్పించారు. ఎన్నికల సమయంలో ఎవరూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించకూడదని పోలీసులు సూచించారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని కోరారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల సమయంలో నిబంధనలను ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు భంగం కలిగించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సున్నిత గ్రామాల్లో పరిస్థితులను పర్యవేక్షిస్తూ, ప్రజల్లో ఎన్నికలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పోలీసులు పర్యటించారు.
రిపోర్టర్ : నాగిరెడ్డి, మెలియాపుట్టి, శ్రీకాకుళం జిల్లా.