చంద్రగిరిలో 142 నామినేషన్ల తిరస్కరణ..! – ఓటమి భయంతోనే అడ్డగోలు తిరస్కరణలంటూ మోహిత్‌రెడ్డి ఆరోపణ
తిరుపతి రూరల్, మేజర్ న్యూస్ :చంద్రగిరి నియోజకవర్గంలో 142 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆరోపించారు. అధికారులను అడ్డు పెట్టుకుని అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా నామినేషన్లను తిరస్కరింపజేశారని విమర్శించారు. తిరస్కరణలపై ఆర్డీవోకు అప్పీలు చేయడంతోపాటు, సంబంధిత రిటర్నింగ్ అధికారుల (ఆర్‌వో) తీరుపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
చిన్న కారణాలతో తిరస్కరణలు…
చంద్రగిరి నియోజకవర్గంలో 96 ఎంపీటీసీ స్థానాలకు గాను 94 స్థానాల్లో 304 నామినేషన్లు దాఖలయ్యాయని మోహిత్‌రెడ్డి తెలిపారు. పాకాల, చంద్రగిరి మండలాల్లో 16 చొప్పున, రామచంద్రాపురంలో 9, చిన్నగొట్టిగల్లులో 7, తిరుపతి రూరల్‌లో 40, ఎర్రావారిపాలెంలో 8 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయని వివరించారు. ఎర్రావారిపాలెంలో ఆరు స్థానాలకు మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయని పేర్కొన్నారు. చిన్నచిన్న కారణాలు చూపుతూ 142 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారని ఆరోపించారు. చిన్నగొట్టిగల్లు మండలంలో ఏడు ఎంపీటీసీ స్థానాలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను తొలుత ఆమోదించిన ఆర్‌వో.. సాయంత్రానికి రెండు స్థానాల్లో నామినేషన్ల తిరస్కరణను ప్రకటించారని తెలిపారు. నామినేషన్ల పరిశీలనలో పారదర్శకత పాటించాల్సిన అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని విమర్శించారు. తిరస్కరణకు గురైన అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పారు.
తిరస్కరణలు, దాడుల వ్యవహారాలపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి, న్యాయపరంగా ముందుకెళ్తామని మోహిత్‌రెడ్డి స్పష్టం చేశారు.
Dwaraka, staff reporter.
9705347341.