మెదడు, వెన్నెముక ఆరోగ్యంపై కిమ్స్ అవగాహన కార్యక్రమం
నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్ : ప్రపంచ వెన్నెముక, స్ట్రోక్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు కిమ్స్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎంజీబీ మాల్ వద్ద ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రెడ్ ఎఫ్ఎం 93.5, ఎంజీబీ మాల్ సహకారంతో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు డార్ట్ ఛాలెంజ్, వైర్ బజ్ ఛాలెంజ్, ప్లాంక్ ఛాలెంజ్, హ్యాంగింగ్ ఛాలెంజ్ వంటి వినూత్న క్రీడలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు న్యూరోసైన్సెస్ వైద్యులు ప్రజలతో ముఖాముఖి మాట్లాడి మెదడు, వెన్నెముక ఆరోగ్యంపై కీలక సూచనలు చేశారు. మెదడుకు రక్తప్రసరణలో అంతరాయం కలగడం లేదా రక్తస్రావం జరగడం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. ముఖం ఒకవైపు వాలిపోవడం, చేతిలో అకస్మాత్తుగా బలహీనత, మాట తడబడటం వంటి లక్షణాలను గుర్తించేందుకు
'ఎఫ్ ఏ ఎస్ టి' (ఫేస్, ఆర్మ్, స్పీచ్, టైమ్) పద్ధతిని ప్రజలకు వివరించారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్యసాయం పొందాలని సూచించారు. అలాగే ఎక్కువసేపు ఒకేచోట కూర్చోవడం, సరైన భంగిమ లేకపోవడం, శారీరక శ్రమ లోపించడం వల్ల వెన్ను, మెడ సమస్యలు వస్తాయని, నిరంతర నొప్పి లేదా కాళ్లు, చేతుల్లో బలహీనత ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని అవగాహన కల్పించారు.
స్ట్రోక్ సమయంలో సకాలంలో తీసుకునే నిర్ణయం జీవితాన్ని కాపాడుతుందని, వెన్నెముక ఆరోగ్యంపై నేడు చూపే శ్రద్ధ రేపటి జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందని వైద్యులు పేర్కొన్నారు. ప్రజల్లో ఆరోగ్య స్పృహను పెంపొందించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వైద్య బృందాన్ని, సిబ్బందిని కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొల్లినేని భాస్కర్ రావు, డైరెక్టర్ బొల్లినేని అద్విక్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ రీజినల్ సీఓఓ డాక్టర్ ప్రవీణ్ కుమార్ వంచి, యూనిట్ సీఓఓ డాక్టర్ రోహిణి ప్రియ లక్ష్మి, న్యూరోసైన్సెస్ వైద్యులు డాక్టర్ సంఘమిత్ర, డాక్టర్ వి. అభినయ రెడ్డి, డాక్టర్ బి.వి. సాయి భరత్, న్యూరోసర్జరీ వైద్యులు డాక్టర్ సి. కృష్ణమోహన్, డాక్టర్ జి. సాయినాథ్ పాల్గొన్నారు.