సూర్య కరీంనగర్ : వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబన, స్వయం ఉపాధి ప్రోత్సాహం, రుణ సదుపాయాల కల్పనలో తెలంగాణ రాష్ట్రం ప్రతిభ కనబరిచి స్వనిధి సమ్మాన్–2026లో రెండు జాతీయ అవార్డులు సాధించింది. ఇన్నోవేటివ్ బెస్ట్ ప్రాక్టీసెస్, ఫాస్టెస్ట్ మూవర్ విభాగాల్లో రాష్ట్రానికి అవార్డులు లభించాయి. రాష్ట్రస్థాయిలో కరీంనగర్ జిల్లా ప్రతిభకు గుర్తింపుగా అవార్డు స్వీకరణకు కరీంనగర్ మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ జి. స్వరూపారాణిని ఎంపిక చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రంలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చేతుల మీదుగా ఆమె జాతీయ అవార్డును అందుకున్నారు. ఈ గుర్తింపు రాష్ట్ర మెప్మా విభాగం, పట్టణ స్థానిక సంస్థలు, క్షేత్రస్థాయి సిబ్బంది సమష్టి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని మరింత బలోపేతం చేసి వీధి వ్యాపారులకు పథక ప్రయోజనాలు అందేలా కృషి చేయనున్నట్లు తెలిపారు.