ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి జాబ్ కార్డుల వెరిఫికేషన్ పూర్తి చేయాలి.. ఉపాధి పనులు, నీటి సంరక్షణపై కలెక్టర్ సమీక్ష
సిద్దిపేట ప్రతినిధి; ల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, ఉపాధి హామీ పనులు, నీటి సంరక్షణ పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ కె. హైమావతి శనివారం సమీక్ష నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, ఎంపీఓలు, ఏపీఓలు, ఏపీఎంలు, హౌసింగ్ ఏఈలతో నిర్వహించిన సమావేశంలో పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ రమేష్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, హౌసింగ్ పీడీ భగవంత్ రావు, డీపీఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
జాబ్ కార్డుల పరిశీలన వేగవంతం చేయాలి..
ప్రధానమంత్రి గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద జాబ్ కార్డుల పరిశీలన ప్రక్రియపై కలెక్టర్ సమీక్షించారు. మండలాల వారీగా పురోగతిని పరిశీలించి, వెనుకబడిన మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి పరిశీలనను వేగవంతం చేయాలని సూచించారు. క్షేత్రస్థాయి అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అర్హులైన ప్రతి కుటుంబ వివరాలను సకాలంలో పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న జాబ్ కార్డుల పరిశీలనను ప్రాధాన్యతగా తీసుకుని నిర్ణీత గడువులో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి.
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో జిల్లాలో పురోగతి ఆశించిన స్థాయిలో లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంజూరైన ప్రతి ఇంటికి మార్కింగ్ చేయాలని, రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలు పునాది, గోడలు, స్లాబ్, ప్లాస్టింగ్, ముగింపు దశల్లో ఎన్ని ఉన్నాయో వివరాలు సేకరించాలని, ఆయా దశల్లో ఎంతమందికి చెల్లింపులు జరిగాయి, ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయో సమీక్షించారు. ఇళ్ల నిర్మాణాలను పూర్తిస్థాయిలో ప్రారంభించి, నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేసుకునేలా ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల విషయంలో సిద్దిపేట జిల్లాను ముందంజలో నిలిపేలా అధికారులు సమష్టిగా పనిచేయాలని సూచించారు.
రూ.230కే సిమెంట్ బస్తా..
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 50 కిలోల సిమెంట్ బస్తాను రూ.230కే అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. గ్రామస్థాయి అధికారులు లబ్ధిదారుల వివరాలను సంబంధిత అనువర్తనంలో నమోదు చేస్తే సిమెంట్ బస్తా తక్కువ ధరకు లభిస్తుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు వినియోగించుకోవాలని సూచించారు.
ఉపాధి పనులపై ప్రత్యేక దృష్టి…
వీబీజీ రామ్ జీ పథకం కింద చేపడుతున్న పనులు, కూలీల హాజరు, రోజువారీ పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలోని 26 మండలాల పరిధిలో గ్రామపంచాయతీల్లో 1,88,054 మంది క్రియాశీల కూలీలు ఉండగా, వారిలో 39,702 మంది పనుల కోసం డిమాండ్ నమోదు చేసుకున్నారు. జాతీయ మొబైల్ పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా 21,580 మంది కూలీల హాజరు నమోదైనట్లు తెలిపారు.ఉపాధి పనుల్లో మరింత పురోగతి సాధించాలని, గ్రామపంచాయతీల వారీగా కూలీలకు పని కల్పించడం, హాజరు నమోదు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. ప్రతి గ్రామంలో పనులు సక్రమంగా నిర్వహించాలని, కూలీలకు ఉపాధి కల్పించడంలో నిర్లక్ష్యం చేయకుండా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
జలసిరి పనులతో నీటి సంరక్షణ..
వీబీజీ రామ్ జీ పథకం ద్వారా జలసిరి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పొలానికి పంట కుంట, ప్రతి గ్రామానికి నీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. వర్షాకాలం ముగిసినప్పటికీ పనుల్లో అలసత్వం ప్రదర్శించరాదని, నిర్దేశించిన లక్ష్యాలను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు.ఎల్‌నినో ప్రభావంతో పంటల సాగుకు నీటి కొరత ఎదుర్కొనే రైతులు, కూలీలకు జలసిరి కార్యక్రమం ద్వారా చేపట్టే పనులు ఉపాధి కల్పించడంతో పాటు నీటి సంరక్షణకు దోహదపడతాయని తెలిపారు. మండలాల వారీగా ప్రణాళిక రూపొందించి ప్రతి గ్రామంలో రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్దేశిత లక్ష్యాలను తప్పనిసరిగా చేరుకోవాలని కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు.