telangana
ఫీజుల బకాయిలపై విద్యార్థుల సమరభేరి రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య
సూర్య,తెలంగాణ, బ్యూరో ప్రతినిధి
: తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థి ఆందోళనకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలెక్టరేట్‌లు, ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాలను ముట్టడించి ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించాలని విద్యార్థులకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలకు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో సుమారు 16 లక్షల మంది కళాశాల విద్యార్థులకు సంబంధించిన ఫీజుల బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆర్. కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కోర్సులు పూర్తి చేసిన సుమారు ఆరు లక్షల మంది విద్యార్థులకు కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిలిపివేస్తున్నాయని, ఫీజులు చెల్లించే వరకు చదువుతున్న విద్యార్థులకు తదుపరి సంవత్సరం ప్రవేశాలు కల్పించడం లేదని విమర్శించారు. గత ఆరు నెలలుగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.8 వేల కోట్ల ఫీజుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయకుండా గతంలో అమలైన పాత విధానంలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిపివేయరాదని హైకోర్టు తీర్పులు, ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ కళాశాలలు వాటిని పట్టించుకోకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని మండిపడ్డారు.
భూములు విక్రయిస్తూ, లక్షల కోట్ల రూపాయల అప్పులు తెస్తూ, వివిధ మార్గాల్లో భారీ ఆదాయం సమకూర్చుకుంటున్న ప్రభుత్వానికి పేద విద్యార్థుల చదువుల కోసం రూ.8 వేల కోట్లు కేటాయించడానికి డబ్బులు లేవా అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లిస్తున్న ప్రభుత్వం, 14 నుంచి 16 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఫీజులు, స్కాలర్‌షిప్‌లు చెల్లించకపోవడం అన్యాయమన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, పేద కుటుంబాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం పొందారని, ఈ పథకం సమాజంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిందని పేర్కొన్నారు. అలాంటి పథకానికి నిధులు కేటాయించకుండా నీరుగార్చడం పేద వర్గాల విద్యాభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించకుండా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, బీసీ సంఘాలు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలతో చర్చించాలని కోరారు.
విద్యార్థులకు ఫీజులు మంజూరైన వెంటనే వారి మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపించాలని, రైతుబంధు నిధుల జమ వివరాలను రైతులకు తెలియజేసిన తరహాలోనే ప్రతి విద్యార్థికి ఫీజుల మంజూరు వివరాలు తెలియజేయాలని సూచించారు. దీంతో కళాశాలలకు వెళ్లి తమకు మంజూరైన ఫీజుల వివరాలను తెలుసుకొని సర్టిఫికెట్లు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు.
గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా 2007లో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులోకి వచ్చిందని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన ఈ పథకాన్ని పక్క రాష్ట్రాల్లో సమర్థంగా అమలు చేస్తున్నప్పుడు, ధనిక రాష్ట్రమైన తెలంగాణలో అమలు చేయడానికి ఇబ్బందులేమిటని ప్రశ్నించారు. గురుకుల విద్యా వ్యవస్థను కూడా దశలవారీగా నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.
విద్యార్థుల ఉద్యమాన్ని ప్రభుత్వం తక్కువ అంచనా వేయరాదని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థులు పోషించిన కీలక పాత్రను గుర్తుచేస్తూ, వారి సహనాన్ని పరీక్షిస్తే మరోసారి విద్యార్థుల తిరుగుబాటును చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 25న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో విద్యార్థులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లు, ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలు నిర్వహించి, ఫీజుల బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి వినతిపత్రాలు అందజేయనున్నారు.
ఏ రవీందర్, హైదరాబాద్.